Visakha: 2024లో ఓటు ఎవరికి వేయాలి.. సందిగ్ధంలో ఉత్తరాంధ్ర ప్రజలు?

by Disha Web Desk 16 |
Visakha: 2024లో ఓటు ఎవరికి వేయాలి.. సందిగ్ధంలో ఉత్తరాంధ్ర ప్రజలు?
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉచిత పథకాలతో మనీ ట్రాన్స్ఫర్లతో అధికార పార్టీ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం ఫలితాలను ఇస్తుందో అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కేవలం ప్రజలకు నగదు బదిలీ పథకాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ మేరకు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనలను చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలను పక్కన పెట్టి కేవలం ఉచిత పథకాలతో నెట్టుకొస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో ఇటీవల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడం అందరికీ తెలిసిందే. మరి ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఇదే ఉచిత పథకాలు నగదు బదిలీ పథకాలతో ఇంకా ఎంతకాలం నెట్టుకు రాగలరని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలను తమ నెత్తిన వేసుకుంటున్నామనే భరోసా కల్పించడానికి ఇటీవల ఏర్పాటు చేసిన విదేశీ పెట్టుబడుల సదస్సుల సమాహారం ఏ మేరకు ఉత్తరాంధ్రకు మేలు చేయగలదో స్పష్టత లేని అంశంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

పాదయాత్రలో నిరుద్యోగ సమస్యపై హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెరవేర్చలేకపోయారనే అంశంపై నిరుద్యోగ సంఘాలు ప్రశ్నించుకుంటున్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, రైల్వే జోన్ అంశం, పరిశ్రమల కాలుష్యం సమస్యలు ముసురుకొని ఉన్నాయి. వీటన్నింటిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి రుషికొండ‌పై నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో డిపాజిట్లు సహితం గల్లంతయిన బీజేపీ ఇంకా తామే ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తామని బీరాలు పలుకుతున్నా ఆ పార్టీ నేతలు ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఉందని ప్రజలు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పక్కన పెట్టి ఉత్తరాంధ్రకు ఏదో చేస్తామంటూ బీజేపీ మాటలను లెక్కలోకి తీసుకోవడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగిందేమీ లేదని భావిస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం యాత్రకు మాత్రమే పరిమితమైపోతుందనే అపవాది ఉంది. కేవలం లోకేష్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయని, రాష్ట్ర భవిష్యత్తుని పట్టించుకునే పరిస్థితి లేదని రాజకీయ విమర్శకులు విశ్లేషిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను జనసేన పార్టీ ఆదుకుంటుందని భావించినా కేవలం స్పష్టత లేని పొత్తులు, బ్రేక్ జర్నీలతోనే కాలం గడుపుతోందనే విమర్శలు వినిపిస్తు్న్నాయి.

ఉత్తరాంధ్ర ప్రజలు తాయిలాలకు లొంగరు

ఉత్తరాంధ్ర ప్రజలు తాయిలాలకు లొంగరని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టతను ఇచ్చారు. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా ఓటుకు నోటు పంచితే గట్టిగానే సమాధానం ఉంటుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాటుకున్నారు. ఇక్కడి ప్రజలకు ఏం కావాలో నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు కేవలం పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి స్వయం నిర్ణయాలను తీసుకుంటే ఏ పార్టీ అయినా మరోసారి ఓటమి తప్పదని పలువురు సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ పత్రికలను మీడియాను పక్కనపెట్టి వ్యవహరిస్తున్నా తీరు మార్చుకోకపోతే 2024 ఎన్నికల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story