జీవీఎంసీ కమిషనరుకు షాక్.. ‘దిశ’ కథనాలకు స్పందన

by Anjali |
జీవీఎంసీ కమిషనరుకు షాక్.. ‘దిశ’ కథనాలకు స్పందన
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో వేల కోట్ల రూపాయల స్కాంగా మారిన విశాఖ ఎన్సీసీ భూముల కుంభకోణంపై ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం స్పందించింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్)ల ఒత్తిడి, సింగపూర్ రమణారెడ్డి, కొట్టు మురళీల స్కెచ్‌తో ఈ భూముల్లో విల్లాల నిర్మాణం ప్లాన్‌కు వ్యూహాత్మకంగా డీమ్డ్ అప్రూవల్ చేసిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఇచ్చిన డీమ్డ్ అప్రూవల్‌ను రద్దు చేసే అధికారం జీవీఎంసీకి లేకపోవడంతో అందుకోసం ఆ ఫైల్‌ను అమరావతి పంపాల్సిందిగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో మంగళవారం ఆ ఫైలును అమరావతి పంపినట్లు తెలిసింది. అమరావతిలో వీటిని పరిశీలించి ప్లానింగ్ అధికారులు పలు అభ్యంతరాలు లేవనెత్తుతూ షార్ట్ ఫాల్ రాసినందున వాటి ఆధారంగా విల్లా నిర్మాణ ప్లాన్‌లను రద్దు చేయనున్నారు.

17 కోట్ల రహదారుల టెండర్ రద్దు?

దీంతో పాటు ఎన్సీసీ భూముల్లో జీవీఎంసీ ద్వారా రూ.17 కోట్లు ఖర్చు చేయించి రహదారులు వేసేందుకు అప్పటి మున్సిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎర్రా శ్రీలక్ష్మీ ఇచ్చిన జీవోను కూడా పెండింగ్‌లో పెట్టారని తెలిసింది. ప్రైవేటు భూములకు ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో రహదారులు వేయడంపై విమర్శలు రావడంతో దానిని పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

బాధ్యులపై చర్యలు..

ఈ భూముల స్కాంలో బాధ్యులైన రెవిన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులను గుర్తించే పనిని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. విజయసాయి, కేఎన్ఆర్‌ల వత్తిడికి లొంగి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Next Story