దీపావళి పేరుతో ఊర్లు...ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 21 |
దీపావళి పేరుతో ఊర్లు...ఎక్కడో తెలుసా?
X

దిశ , డైనమిక్ బ్యూరో : దీపావ‌ళి అంటేనే పండుగ అని అందరికీ తెలుసు. భారతదేశమంతా ఈ దీపావళి పండుగను ఎంతో కన్నుల పండువగా జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ మెుక్క విశిష్టత గురించి అందరికీ తెలుసు.‘నరకాసురుని వధించి నరులందరి జీవితాలలో వెలుగును నింపిన మాతా సత్యభామ శౌర్యానికి..చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి’ ఇలా అనేక రకాలుగా జరుపుకుంటారు. అయితే దీపావళి పేరుతో ఓ గ్రామం సైతం ఉంది. ఒక గ్రామం కాదు రెండు గ్రామాలు ఉన్నాయి. ఇవి ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లాలోనే ఉండటం విశేషం.

దీపావళి పేరు ఎలా వచ్చిందంటే

శ్రీ‌కాకుళం జిల్లాలో గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. ఈ గ్రామం సముద్ర తీరానికి దగ్గరకు ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు ఈ గ్రామం 9కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టడానికి చాలా చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం కళింగరాజు పాలించేవారు. అయితే ఓ రోజు ఆ కళింగ రాజు గుర్రంపై వెళ్తూ మార్గమధ్యంలోని ఈ గ్రామం వద్ద స్పృహతప్పి పడిపోయారు. దీంతో కళింగ రాజును చూసిన గ్రామస్థులు ఆయనకు సపర్యలు చేశారు. ఆ మహారాజును స్పృహలోకి తీసుకువచ్చారు. అనంతరం ఆ మహారాజు తేరుకున్నారు. ఆ గ్రామ ప్రజలకు కళింగ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఇంతకీ ఈ గ్రామం పేరు ఏంటి అని కళింగరాజు అడుగుతాడు. తమ గ్రామానికి ఎలాంటి పేరు లేదని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో కళింగరాజు తన ప్రాణదీపాన్ని నిలబెట్టినందుకు ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు చరిత్ర చెప్తుంది. ఇకపోతే ఈ దీపావళి గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉన్నాయి. అయితే దీపావళి పండుగ వస్తే చాలు ఈ గ్రామం వార్తల్లో నిలుస్తోంది. అయితే దీపావళి ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని తమకు మాత్రం ప్రతీరోజూ దీపావళేనని ఆ గ్రామస్థులు తెలియజేస్తున్నారు.

దీపావళి పేట కూడా..

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి గ్రామం ఉంది. ఈ టెక్కలిలో దీపావళి పేట పేరుతో గ్రామం ఉంది. ఈ గ్రామానికి దీపావళి పేట అనే పేరు రావడానికి కూడా వందేళ్ల చరిత్ర ఉందని ఆ గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు. శతాబ్ధం క్రితం ఆ గ్రామంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించిందట. అప్పట్లో పూరిళ్లు ఉండేవి. విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయితే పూరింట్లో నూనె దీపాలు వెలిగించేవారన్న విషయం తెలిసిందే. అయితే ఓ రోజు ఓ ఇంట్లో నూనె దీపాన్ని వెలిగించారు. ఎలుకలు ఆ నూనె దీపాన్ని పడవేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పూరిఇళ్లు కావడంతో గ్రామంలోని అన్ని పూరిళ్లు వరుసగా కాలిపోయాయి. అప్పటినుంచి ఆ గ్రామాన్ని చుట్టుపక్కల ప్రజలు దీపాలపేటగా పిలవడం ప్రారంభించారు. ఎందుకంటే నూనె దీపం కారణంగా గ్రామం తగలబడింది. అయితే అది కాస్త వాడుకలో దీపావళి పేటగా మారిందని గ్రామస్థులు తెలియజేస్తున్నారు. రెవెన్యూ శాఖలో కూడా ఈ గ్రామం పేరు దీపావళి పేటగానే నమోదవ్వడం విశేషం. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఈ గ్రామ ప్రజలకు పండుగ వచ్చినట్లే. ఊరు పేరుకు తగినట్లుగానే దీపావళి పండుగను తెగ సంబరంగా జరుపుకుంటారట.



Next Story

Most Viewed