ప్రజలు అసహ్యించుకునేలా విజయ్‌ పోస్టులు.. మంత్రి మేరుగ నాగార్జున

by Disha Web Desk 16 |
ప్రజలు అసహ్యించుకునేలా విజయ్‌ పోస్టులు.. మంత్రి మేరుగ నాగార్జున
X

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వ్యవహారంపై రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టి, మహిళలను అవమానించిన అరాచకవాది చింతకాయల విజయ్‌ అని ఆరోపించారు. అలాంటి దుర్గార్గమైన వ్యక్తి ఇంటికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్తే, అది ఘోరమని టీడీపీ.. దాని అనుబంధ దుష్ట చతుష్టయం నానా యాగీ చేస్తోంది అని విమర్శించారు.

చింతకాయల విజయ్‌ అనేవాడు అలాంటి పోస్ట్‌లు పెట్టడం కరెక్టేనా?. దానికి శిక్ష ఉండదా?. పోలీసులు విచారణ చేయకూడదా?. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. విజయ్‌ ఇంటికి పోలీసులు వెళ్లారంటూ.. దాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. అదేదో దొంగలు వెళ్లినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. దొంగను పట్టుకోవడానికి పోలీసులు వెళ్తే తప్పు పట్టే స్థాయికి వచ్చింది వీరి వ్యవహారం. ఇంటికి వెళ్లి సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తప్పా? లేక మహిళల మాన, ప్రాణం మీద, వారి శీలం మీద పోస్టులు పెట్టడం, పెట్టించడం తప్పా? దొంగ తనను దొంగగారు అని పిల్చి, సీఐ సీట్లో కూర్చోబెట్టి.. కాఫీ, టీ.. అందించాలని కోరుకుంటున్నాడంటే.. దాన్ని ఇంకొంత మంది వెనకేసుకు వస్తున్నారంటే.. ఇంత కంటే ఘోరం ఉంటుందా? అని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు.

మహిళల మాన, ప్రాణాల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మహిళల మాన, ప్రాణాల మీద టీడీపీ అధికారిక వెబ్ పేజీ నుంచి వారి శీలం మీద అసభ్యంగా పోస్టులు పెట్టారు అని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. ఐటీడీపీ సైట్‌ నుంచి మహిళల మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. అయినా ఈ విషయం మాత్రం టీడీపీ కానీ, దుష్ట చతుష్టకం కానీ చెప్పవు. దోచుకో..పంచుకో..తినుకో బ్యాచ్‌కు తెలిసింది.. అధికారంలో ఉంటే సమాజం మీద, రాష్ట్రం మీద పడి తినడం మాత్రమే తెలుసు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు భార్య మీద, కోడలి మీద.. రామోజీరావు భార్య మీద, కోడలి మీద, రామోజీరావు మనవరాళ్ల మీద.. రాధాకృష్ణ కూతురు మీద.. ఇలా వారి ఇళ్లలో ఉన్న మహిళల మీద ఏనాడూ మేము ఇటువంటి విమర్శలకు దిగడం లేదు అని చెప్పుకొచ్చారు. మా పార్టీ ప్రజలకు చేసిన మంచిని, మేలును నమ్ముకున్న పార్టీనే తప్ప.. దిగజారుడు ప్రచారాన్ని.. దిగజారుడు రాజకీయాన్ని మేము నమ్ముకోలేదు. ఇంత నిగ్రహంగా మా నాయకత్వం, మేము ఉన్నా.. ఎక్కడో ఎవరో ఒకరు సహనం కోల్పోయి ప్రతిస్పందనగా పోస్టింగ్‌ పెడితే.. దేనికి ప్రతిస్పందనగా రియాక్ట్‌ అయ్యారో చెప్పకుండా.. నానా యాగీ చేస్తున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు.

మాకు సంస్కారం ఉంది

టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింతకాయల విజయ్‌కు నోటీసు ఇస్తే, ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలను తిట్టాడని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. మేమూ తిట్టగలం. కానీ మాకు విచక్షణ ఉంది. సంస్కారం ఉంది అని చెప్పుకొచ్చారు. ఇకనైనా మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి.

విజయ్‌ శిక్షార్హుడు అని హెచ్చరించారు. మరోవైపు బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటు. బురద చల్లడం వారి పద్ధతి. టీడీపీ నేతలకు నిజంగా సిగ్గు ఉంటే, చింతకాయల విజయ్‌ను సమర్థించవద్దు. విజయ్‌ తప్పు చేయకపోతే, ఆయన పెట్టిన పోస్టులపై చర్చ పెట్టండి అని మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపు అవసరం లేదు. మాది సంక్షేమ ప్రభుత్వం. ఎవరినో వేధించడం కోసం కేసులు పెట్టాల్సిన అవసరం లేదు మంత్రి నాగార్జున వివరించారు.


Next Story

Most Viewed