పట్టాభిని పోలీసులు కొట్టారు.. ఎస్పీ చేసిన వ్యాఖ్యలు పెద్ద అబద్దం : వర్ల రామయ్య

by Vinod kumar |
పట్టాభిని పోలీసులు కొట్టారు.. ఎస్పీ చేసిన వ్యాఖ్యలు పెద్ద అబద్దం : వర్ల రామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం విధ్వంసకాండపై ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా చెప్పివన్నీ పచ్చి అబద్ధాలేనని, అక్క డ జరిగిన దారుణాలన్నీ రక్షకులు భక్షకులు సామూహికంగా జరిపినవేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తేల్చిచెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గన్నవరం విధ్వంసకాండ ముమ్మాటికీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమేనని ఆరోపించారు.

పోలీసులు, వైసీపీ అరాచకశక్తుల సామూహికంలో జరిగిన దురాగతమని కరాఖండిగా చెప్పగలమన్నారు. మనరాష్ట్రం.. మనపోలీసులు.. మన ఆసుపత్రి అయ్యేసరికి పట్టాభికి తగిలిన దెబ్బలు వైద్యులకు కనిపించలేదా? దొంతు చిన్నాని, అతని కుటుంబాన్ని ఫోన్లో బెదిరించిన వైసీపీ మూకలపై పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే గన్నవరం విధ్వంసకాండ జరిగేదా ఎస్పీ ?అని వర్ల రామయ్య నిలదీశారు.

విజయవాడలో కాకుండా ఏ హైదరాబాద్‌లోనో, లేక ఎంపీ రఘురామ కృష్ణంరాజుని పరీక్షించిన ఆర్మీ ఆసుపత్రిలోనో పరీక్ష చేయిస్తే, పట్టాభిని పోలీసులు ఎంత దారుణంగా హింసించారో ప్రపంచానికి తెలిసేది అని చెప్పుకొచ్చారు. పట్టాభిని కొట్టలేదన్న ఎస్పీ మాటలు అబద్ధాలకే పెద్ద అబద్ధం అని చెప్పుకొచ్చారు. పట్టాభిని కొట్టకపోతే, అతను సరిగా అన్నం కూడా తినలేని స్థితిలో ఎందుకున్నాడో ఎస్పీ సమాధానం చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఐ కనకారావుని కులంపేరుతో దూషించి, అతని తలపగలగొట్టడానికే పట్టాభి గన్నవరం వెళ్లాడా ఎస్పీ అని ప్రశ్నించారు. వైసీపీ గూండాలు దాడిచేస్తున్నప్పుడే, వారిలో ఎవడో విసిరిన రాయి అక్కడున్న సీఐ తలకు తగిలి గాయమైంది. సీఐకి అయిన గాయాన్ని పోలీసులు వైసీపీకి అనుకూలంగా మార్చి కట్టుకథలు అల్లి, పట్టాభిపై తప్పుడు కేసులు పెట్టారు అని వర్ల రామయ్య ఆరోపించారు. పట్టాభిని సాధించాలనుకుంటున్నవారి కుట్రలో భాగమైన సీఐ కనకారావుకి ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి, డీజీపీలే బాధ్యత వహించాలని వర్ల రామయ్య హెచ్చరించారు.

Next Story

Most Viewed