ఏపీలో నిరుద్యోగిత రేటు 24%: నారా లోకేశ్ ఆందోళన

by Seetharam |
ఏపీలో నిరుద్యోగిత రేటు 24%: నారా లోకేశ్ ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నిరుద్యోగిత రేటు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి పెరగటం దురదృష్టకరమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో వర్ధిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌ సర్వ నాశనం చేశారని విమర్శించారు. దీని ఫలితంగా యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని మండిపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలని నారా లోకేశ్ ట్విటర్ వేదికగా తన ఆకాంక్షను వెల్లడించారు.


యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

ఇకపోతే నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద ఈ మైలురాయికి చేరుకోవడంతో నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరైన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ పాయకరావుపేటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 18కి యువగళం పాదయాత్ర ముగియనుంది. అనంతరం ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణలు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.Next Story

Most Viewed