- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ పనితీరు పై విమర్శల వెల్లువ
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) శాఖలో మేమే రాజు.. మేమే మంత్రి అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇందులోని ఉన్నతాధికారులు ఏది చెబితే అదే బ్రహ్మ వాక్కు. వాళ్ళు అనుకుంటే ఉద్యోగాలు ఇవ్వగలరు.. తీసేయగలరు. లేని రూల్ సృష్టించగలరు.. ఉన్నదానిని పాటించరు. ఒక్కొక క్రీడా సంఘానికి ఒక్కో ట్రీట్మెంట్. అనుకుంటే నిమిషాల్లో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వగలరు. అదేమిటని ఎవరైనా అంటే.. కార్యాలయంలోకి నో ఎంట్రీ. శాప్‌లో జరుగుతున్న పొరపాట్లను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఏ మార్పు లేకపోగా.. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయని పలువురు క్రీడా సంఘ ప్రతినిధులు వాపోతున్నారు.
రూల్స్‌కి విరుద్ధంగా..
శాప్ కార్యాలయంలో కారుణ్య నియామకాలు డబ్బు కొట్టు.. ఉద్యోగం పట్టు అనేలా జరిగాయని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి కారుణ్య నియామకాలు చేసుకునే వేసులుబాటు లేనప్పటికీ, 2016 నుంచి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని సమాచారం. ఉద్యోగ విరమణ చేసిన వారికి పెన్షన్ వెసులుబాటు లేకపోయినా, ఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి శాప్ ఉద్యోగులకు జీతాలు 010 పద్దు ద్వారా ఇవ్వడం లేదు. ఈ విధానంలో వేతనాలు పొందే వారికి మాత్రమే పెన్షన్ సదుపాయం అందుబాటులో ఉంది. అయినప్పటికీ రూల్స్‌కి విరుద్ధంగా పెన్షన్ ట్రస్టు పేరుతో అమలు చేస్తున్నారు. ఇలా.. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సరైన వేతనాల్లేక..
శాప్‌లో శిక్షకుల వేతనాలు అటెండర్ (నాల్గో తరగతి) కన్నా తక్కువ అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. దీనివల్ల ప్రతిభ ఉన్న శిక్షకులు ఉద్యోగాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఎన్ఐఎస్ లేకపోయినా సీనియర్ క్రీడాకారులను పే అండ్ ప్లే పద్ధతిలో తీసుకొని నెట్టుకొస్తున్నారు.
అమలు కాని పీఆర్సీ..
శాప్‌లో 1993, 1999, 2009 బ్యాచ్‌ల కాంట్రాక్టు శిక్షకులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి నేటి వరకు 11వ పీఆర్సీ 2022 నుంచి అమలు కాకపోవడంతో నిరాశతో ఎదురుచూస్తున్నారు. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.. ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీఓ ఉన్నప్పటికీ అమలులో జాప్యం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడిగేతే ఫైల్ మాయం..
రూల్స్ అతిక్రమించి చేసిన పనిని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఫైల్ సైతం మాయం అవుతుందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. శాప్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ శాతం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు కేవలం కారుణ్య నియామకాలు పొందిన వారు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. శాప్‌లో కారుణ్య నియామకాలు పొందిన వారిలో వారి తల్లిదండ్రుల ఉద్యోగాల నియామకం, క్రమబద్దీకరణ రూల్స్ విరుద్ధంగా చేశారని సమాచారం.
ఉద్యోగాల భర్తీ ఎప్పుడో..
శాప్‌లో సుమారు 350 పర్మినెంట్ ఉద్యోగాలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పవచ్చు. కేవలం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ కాలం గడుపుతున్నారు.
ఆశలన్నీ చైర్మన్, వైస్ చైర్మన్‌పైనే..
శాప్‌లో రూల్స్ కి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలపై తక్షణమే చైర్మన్, వైస్ చైర్మన్ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.