తొలి జాబితాలో లేని ఏపీ నేతల పేర్లు.. అందుకోసమేనా..?

by Ramesh Goud |
తొలి జాబితాలో లేని ఏపీ నేతల పేర్లు.. అందుకోసమేనా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలక ముందడుగు వేసింది. రాబోయే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బీజేపీ, దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధుల తోలి జాబితా విడుదల చేసింది. బీజేపీ తొలి జాబితా మొత్తం 195 మందితో రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ నుంచి 9 మందిని ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఒక్కరి పేరు కూడా ప్రకటించలేదు. దీనికి కారణం పొత్తులపై సమాలోచనలేనా..? లేక మరేదైనా ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడి జోరుగా నడుస్తొంది. అటు అధికార ప్రతిపక్షాలు అభ్యర్ధులను ప్రకటిస్తూ.. విస్తృతంగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పటికే జనసేనను కలుపుకొని ఎన్నికలకు వెళ్లేందుకు పొత్తు కుదుర్చుకుంది. ఇటు బీజేపీతో కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించగా, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం పొత్తుల విషయంపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు. పొత్తులు కొలిక్కి రానందువల్లే ఏపీలో టికెట్లను ప్రకటించలేదా..? లేక అందరూ అనుకుంటున్నట్లుగా ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టాలని టికెట్ల ప్రకటన ఆపిందా అనేది ప్రశ్నార్ధకం అయ్యింది.

ఏపీలో కొన్ని స్థానాలైనా గెలిచి తన ఉనికి చాటుకుందేకు బీజేపీ తీవ్ర కృషి చేస్తొంది. ఈ నేపధ్యంలోనే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తొంది. ఏపీలో ప్రధాన పార్టీలు టికెట్లు ప్రకటిస్తుండగా సీట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నేతలను అక్కున చేర్చుకొని టికెట్లు కేటాయించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. దీని కోసమే పొత్తులపై తుది నిర్ణయం తీసుకోవట్లేదనే ప్రచారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ కోసమే బీజేపీ సీట్లు ప్రకటించలేదని, కూటమితో కలిసేందుకు జాప్యం చేయడంలో ఇది కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story