Andhra University: విద్యావ్యవస్థ చిన్నాభిన్నం.. ఏయూలోనే అంకురార్పణ

by Indraja |
Andhra University: విద్యావ్యవస్థ చిన్నాభిన్నం.. ఏయూలోనే అంకురార్పణ
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నానికి ఆంధ్రా యూనివర్సిటీలో అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కాలేజీలలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను 114 మందిని, ఇతర యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకులను ఆంధ్రా యూనివర్సిటీకి బదిలీపై తీసుకు వచ్చి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత స్టేట్ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్ర రెడ్డి, ఏయూ వైస్ ఛాన్సలర్ పివీజీడీ ప్రసాద రెడ్డిలకు దక్కుతుందని యూనివర్సిటీ అధ్యాపక సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

డిగ్రీ కాలేజీల నుంచి ఎయిడెడ్ అధ్యాపకులను యూనివర్సిటీకి తేవడానికి గల బలీయ కారణాలు వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి, చైర్మన్ హేమచంద్ర రెడ్డిలతో పాటు రింగ్ మాష్టర్ విజయసాయి రెడ్డికి మాత్రమే తెలుసని, దీని వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయని తెలిసింది..

నిజంగా తుగ్లక్ నిర్ణయమే..

అయితే, ఈ తుగ్లక్ నిర్ణయం వలన డిగ్రీ కాలేజీలలో బోధన పూర్తిగా కుంటుపడింది. విశ్వవిద్యాలయానికి కలిసి వచ్చిందేమీ లేదు. కొందరు వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందారు. యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాలేజీ కమిషనర్ పోలా భాస్కర్‌కు తన పలుకుబడితో ముఖ్యమంత్రి పేషీ నుంచి మొట్టికాయలు వేయించిన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద రెడ్డికి ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్లైంది.

తిరిగి పోలా భాస్కర్ రెండు రోజుల కిందట అదే పోస్టులోకి వచ్చారు. అప్పట్లో పోలా భాస్కర్ ఆదేశాల మేరకు కొంతమంది తిరిగి డిగ్రీ కాలేజీలకు వెళ్లిపోయారు. ఇప్పుడు మిగిలిన వారి పని ఆయన పడతారని అంటున్నారు

ఎన్ని కోట్లు చేతులు మారాయో?

డిగ్రీ కాలేజీలు, ఇతర యూనివర్సిటీల నుండి వచ్చిన అధ్యాపకులకు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా హెడ్స్, బోర్డు అఫ్ స్టడీస్ ఛైర్మెన్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్, డీన్లు, వార్డెన్ల పదవులివ్వడం యూనివర్సిటీ ఔన్నత్యాన్ని దెబ్బతీయడమేనని ఆటా ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా, 150 మందికి పైగా బయట కాలేజీలు, ఇతర యూనివర్సిటీల నుండి పిజీ పూర్తయినవారిని తాల్కాలిక ప్రొఫెసర్‌లుగా, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా అడ్డదారిలో కావాల్సిన వారిని నియమించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది.

డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డిగ్రీ బోధనకే పరిమితం చేయాల్సి ఉండగా, వారికి రీసెర్చ్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా మరొక తప్పు అని తెలిసినా తన చేతుల్లోనే అధికారం ఉందన్న కారణంతో ప్రసాదరెడ్డి ఇస్టానుసారం చేశారు. ఇలా వచ్చిన వారి నుంచి లక్షల్లో వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి.

అక్రమంగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ల నియామకం..

అంతే కాకుండా ప్లేసెమెంట్ ఆఫీసర్లని నలుగురిని నెలకు రెండు లక్షల రూపాయలతో నియమించడం ద్వారా యూనివర్సిటీ ధనాన్ని వృథా చేశారు. ఇంతకు ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆచార్యులు ప్లేసెమెంట్ ఆఫీసర్లుగా ఉండేవారు. పిఎస్ అవధాని, శ్రీనివాస రావు, యుగంధర్, శ్రీనివాస కుమార్, లలిత రాణి, బసవయ్య వంటి ఆచార్యులు వేలాదిమంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేసెమెంట్స్‌లో ఉద్యోగాలు ఇప్పించారు. ఉన్నవారిని కాదని లంచాల కోసం కొత్త వారిని తీసుకువచ్చారనే ఆరోపణలున్నాయి.

భాస్కర్ భయం..

ఇప్పుడు తిరిగి పోలా భాస్కర్ ఉన్నత విద్యా కార్యదర్శి అవడంతో ఆంధ్రా యూనివర్సిటీలో తిష్ట వేసిన డిగ్రీ కాలేజీలు, ఇతర యూనివర్సిటీల అధ్యాపకులను తిరిగి వారి మాతృసంస్థలకు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో విశాఖలో పనిచేసిన పోలా భాస్కర్ ఈ అంశంపై దృష్టి సారించారు. మంగళవారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన తెలుగుదేశం రాష్ర్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏయూ వీసీ ప్రసాదరెడ్డి సర్టిఫికేట్లు వున్న అక్షరాస్యుడు అయినప్పటికీ బుద్ధి ఉన్న విద్యావంతుడు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయనను త్వరలో తప్పిస్తామని స్పష్టం చేశారు.

Also Read: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరిNext Story

Most Viewed