వేటకు వేళాయే..చేపల వేట నిషేధం ఎత్తివేసిన కేంద్రం!

by Jakkula Mamatha |   ( Updated:2024-06-14 11:26:09.0  )
వేటకు వేళాయే..చేపల వేట నిషేధం ఎత్తివేసిన కేంద్రం!
X

దిశ,ఉభయగోదావరి జిల్లా: చేపల పునరుత్పత్తి సీజన్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు వేటపై నిషేధం అమలులో ఉంటుంది. ఈ 61 రోజులు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. కాగా శుక్రవారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వేట నిషేధ సమయంలో సముద్రంలోకి వెళ్లకుండా పటిష్ట నిఘా ఉంటుంది. వేట నిషేధం అమల్లో ఉండగా సముద్రంలో మర బోట్ల ద్వారా వేట సాగిస్తే బోటు అనుమతులు, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ఇతర పథకాలు రద్దు చేస్తారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో 49 కిలోమీటర్ల పరిధిలో తీరప్రాంతం ఉండగా‌‌, అద్దరిపేట,తుని, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, సుబ్బంపేట, కోనపాపవేట, కోనసీమ జిల్లాలో సూరసేన యానాం, కాట్రేనికోన, పల్లంకుర్రు, అంతర్వేది, సఖినేటిపల్లి ప్రాంతాలున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. బంగాళాఖాతం తూర్పు తీరంలో వేట సాగించేందుకు తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు తిరిగి తెప్పలు, వలలు, ఇంజిన్లు, బోట్లను వేటకు సిద్ధం చేసుకుంటున్నారు.

కోనసీమ జిల్లావ్యాప్తంగా 94 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది.జిల్లాలో ఏడు చోట్ల మత్స్యకారులు తమ బోట్లను నిలుపుదల చేసుకునేందుకు అనువైన స్థలాలున్నాయి. 9 తీర ప్రాంతం మండలాల్లో సుమారు 40 వరకు మత్స్యకార గ్రామాలు ఉండగా వాటిలో 80 వేల మంది వరకు మత్స్యకారులు నివాసం ఉంటున్నారు. వీరిలో మూడొంతుల మందికి వేటే జీవనాధారం. జిల్లావ్యాప్తంగా 1,900 బోట్ల పై సుమారు 12 వేల మంది వేట సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కోనసీమ పరిధిలోని సముద్ర జలాల్లో స్థానిక మత్స్యకారులే కాకుండా విశాఖ, నక్కపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు అంతర్వేది, ఓడలరేవు జెట్టీల నుంచి సముద్రంలోకి వేటకు వెళతారు. వేట నిషేధం ప్రారంభంలో తమ బోట్లను వారు ఇక్కడే సురక్షిత ప్రాంతాల్లో నిలిపి ఉంచాడు. నిషేధం గడువు ముగుస్తుండటంతో రెండు రోజుల క్రితమేవారు తిరిగి ఇక్కడికి చేరుకుని బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed