విశాఖకు కార్యాలయాల తరలింపు కేసు.. హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

by Disha Web Desk 21 |
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇకపోతే విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై హై కోర్టులో గురువారం విచారణ జరిగింది. విశాఖకు కార్యాలయాలు తరలించవద్దు అన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏజీ శ్రీరాం పిటీషన్ దాఖలు చేశారు. తాము దాఖలు చేసిన రిట్‌ను లంచ్ మోషన్‌గా తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందు ఏజీ శ్రీరాం మెన్షన్ చేశారు. అయితే అంత అత్యవసరం ఏముంది అని ప్రభుత్వ న్యాయవాదిని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్ ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ఏజీ కోర్టుకు తెలియజేశారు. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. కనీసం శుక్రవారం అయినా తమ వాదనలు వినాలని సీజే ధర్మాసనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.అయితే అంత అర్జెన్సీ ఏమీ కనిపించడం లేదని అభిప్రాయపడ్డ సీజే ధర్మాసనం తదుపురి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం నాడు వాదనలు వింటామని స్పష్టం చేసింది.

తిరస్కరణ

అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపారు. అయితే త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించేంత వరకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోబోమని.. కార్యాలయాలు తరలించమని ఏజీ హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఇంతలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీంతో ఈ పిటిషన్‌ను సీజే ధర్మాసనం తిరస్కరించింది.

Next Story

Most Viewed