Ap News: హీటు పుట్టిస్తున్న పెన్షన్ల రాజకీయం... వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్

by Disha Web Desk 16 |
Ap News: హీటు పుట్టిస్తున్న పెన్షన్ల రాజకీయం... వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు దేశం పార్టీ, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో నెలకు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల మీద ఒక పార్టీపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా వృద్ధులతో మాట్లాడారు. 200 రూపాయల పెన్షన్ ను రూ. 2 వేలు చేసి రూ. 1800 వరకు చంద్రబాబు పాలనలో పెంచారన్నారు. జగన్ నాలుగేళ్ల‌లో పెన్షన్ పెంచింది కేవలం రూ.750 మాత్రమేనని నారా లోకేష్ చెప్పారు. దీనిపై వైసీపీ పార్టీ టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మీ కాకమ్మ కహానీలు నమ్మరు: వైసీపీ కౌంటర్

టీడీపీ నాయకులు చెప్పే కాకమ్మ కహానీలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పెన్షన్ల విషయంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు పాలనలో పింఛ‌న్ల రూపంలో నెల‌కు స‌గ‌టున రూ.400 కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ లెక్కన‌ ఐదేళ్ళకు క‌లిసి రూ.25 వేల కోట్లు కూడా కాలేదని, కానీ ప్రస్తుతం సీఎం జగన్ ప్రభుత్వం పింఛ‌న్లపై నెల‌కు స‌గ‌టున రూ.1,765 కోట్లు కేటాయిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక మొత్తంగా ఈ నాలుగేళ్ళలో పింఛ‌న్ల మీద చేసిన ఖ‌ర్చు రూ. 68 వేల కోట్ల పైమాటే అని, అలాగే టీడీపీ ప్రభుత్వంలో ఎన్నిక‌ల‌కు 6 నెలల ముందు వ‌ర‌కూ నెల‌కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి, త‌ర్వాత‌ ఎన్నిక‌ల కోస‌మ‌ని రూ.2 వేలు చేశారని వైసీపీ విమర్శలు చేసింది. అదికూడా జ‌న్మభూమి క‌మిటీలు సిఫార్సు చేసిన 39 ల‌క్షల మందికే ఇచ్చారని, కానీ జ‌గ‌న‌న్న ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వ‌చ్చాక‌ పింఛ‌న్‌ను విడ‌త‌ల వారీగా పెంచారని వైసీపీ తెలిపింది. ప్రస్తుతం 64.06 ల‌క్షల మంది ల‌బ్ధిదారుల‌కు ప్రతినెలా ఒకటవ‌ తేదీన సూర్యోద‌యానికి ముందే పింఛ‌న్ అందుతోందని వైసీపీ పార్టీ టీడీపీకి సమాధానం ఇచ్చింది.



Next Story

Most Viewed