టీడీపీ దోచుకుంది... ప్రశ్నిస్తానన్న పవన్ ప్రశ్నించలేదు : కర్నూలు సభలో సీఎం జగన్

by Disha Web Desk 21 |
టీడీపీ దోచుకుంది... ప్రశ్నిస్తానన్న పవన్ ప్రశ్నించలేదు : కర్నూలు సభలో సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ పాలనలో రూ.2లక్షల 35వేల కోట్లను పారదర్శకంగా నేరుగా లబ్ధి దారుల ఖాతాల్లోకి జమ చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ పాలనలో ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలనే ఆలోచనలతో అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేకపోయిందో ప్రజలు గుర్తించాలని కోరారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీ, ఎల్లోమీడియాలపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు జీవోలు తీసుకువచ్చేవారని అదంతా కేవలం హడావిడి కోసమేనని సీఎం జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ఎన్నికల సమయానికి ప్రజలను మభ్యపెట్టేందుకు ఎత్తులువేసేవారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయం చేశారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడం..దోచుకున్నదాన్ని ఎల్లో మీడియాతోపాటు దత్తపుత్రుడుతో కలిసి పంచుకోవడం జరిగిందని సీఎం జగన్ ఆరోపించారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏనాడూ ప్రశ్నించలేదు అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అనేది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వాస్తవాలు గుర్తించాలని రాష్ట్ర ప్రజలను సీఎం వైఎస్ జగన్ కోరారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించి... రాబోయే రోజుల్లో మరింత మంచి చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రజలను సీఎం వైఎస్ జగన్ కోరారు.


Next Story

Most Viewed