Varla Ramaiah: ఎస్పీగా రిషాంత్ రెడ్డి అనర్హుడు

by Disha Web Desk 16 |
Varla Ramaiah: ఎస్పీగా రిషాంత్ రెడ్డి అనర్హుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం, కస్టోడియల్ టార్చర్ రిషాంత్ అలవాటుగా మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. రిషాంత్ రెడ్డి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే సర్వీసు ప్రారంభం నుంచి ఆయన వైఖరి వివాదాస్పదంగానే ఉందని తెలిపారు. 'నర్సీపట్నంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు యేలేటి సంతోష్ అనే టీడీపీ కార్యకర్తకు పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆయన టార్చర్ భరించలేక యేలేటి సంతోష్ పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకేశాడు. సంతోష్ తల్లి ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తే 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆదేశించింది. సంతోష్‌కు పరిహారం ఇవ్వాలన్న ఎన్ హెచ్ఆర్సీ ఉత్తర్వులను సైతం ఎస్పీ రిషాంత్ రెడ్డి పెడచెవిన పెట్టారు. పోలీసులు న్యాయం చేయలేదని సంతోష్ కోర్టుకెళ్లగా..న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు బేఖాతరు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో చీఫ్ సెక్రటరీ డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఎన్‌హె‌ ఆర్సీ ఆదేశించింది. దీంతో భయపడి నిన్న హడావిడిగా బాధితుడికి పరిహారం ఇస్తూ పోలీసుశాఖ ఉత్తర్వులిచ్చింది' అని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

టీడీపీ కేడర్‌పై తప్పుడు కేసులు

తెలుగుదేశం పార్టీ కేడర్‌ అణచివేతే అజెండాగా ఎస్పీ రిషాంత్ రెడ్డి చట్టవిరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే ఎస్పీ టీడీపీ కేడర్‌ను వేధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌పై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు. ఆదినుంచి పోలీసు శాఖలో వివాదాస్పదుడిగా మారిన రిషాంత్ రెడ్డి ఎస్పీ పదవికి తగడని వర్ల రామయ్య లేఖలో వ్యాఖ్యానించారు. రిషాంత్ రెడ్డిపై కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు నుంచి బదిలీ చేసి అప్రధాన పోస్టులో నియమించాలని డీజీపీకి విజ్జప్తి చేశారు. రిశాంత్ రెడ్డితో సహా తప్పుడు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలి అని లేఖలో డీజీపీని వర్ల రామయ్య కోరారు.

READ MORE

Nara lokesh డబ్బులిస్తుంటే వదన్న బజ్జీల బండి బాబాయ్ (వీడియో)


Next Story

Most Viewed