- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యకేసు.. పోలీసులపై సుప్రీం ఆగ్రహం
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యకేసు దర్యాప్తుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబరుకల్లా దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించాలని చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆదేశించింది. కేసును దర్యాప్తు చేసి, ఓ కొలిక్కి తీసుకురావడం రాష్ట్ర పోలీసుల వల్ల కాదంటే సీబీఐకి అప్పగిస్తామని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది నవంబర్ 18 లోగా కేసులో ట్రయల్ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించారు. డ్రైవర్ హత్యకేసులో ఆనాటి పోలీసులు ఎమ్మెల్సీతో కలిసి కుమ్మక్కయ్యారని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా ఛార్జిషీటును దాఖలు చేయడం ఇందుకు అద్దం పడుతోందని పేర్కొంది.
సుబ్రహ్మణ్యం హత్యకేసులో అభియోగాల నమోదు, సాక్ష్యాల పరిశీలనను ఏప్రిల్ 18లోగా పూర్తిచేయాలని సూచించింది. కేసు విచారణను ఆపివేసేలా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాలతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. 2022 మే 19వ తేదీన సుబ్రహ్మణ్యం హత్యకు గురవ్వగా.. అతని మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎమ్మెల్సీనే తమ కొడుకును చంపేశాడని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కేసు పెట్టగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పై ఉన్నారు.
మండలి నుంచి వెళ్లిపోయిన అనంతబాబు
తాజాగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేయడంతో.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా శాసనమండలి నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు లక్ష్మీదుర్గకోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్యను కాపాడుకునేందుకే అనంతబాబు మండలి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.






