Village Revenue Assistants: మాకు పే స్కేల్ అమలు చేయాలి

by Disha Web Desk 16 |
Village Revenue Assistants: మాకు పే స్కేల్ అమలు చేయాలి
X

దిశ, నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ నాయకులుగా పని చేస్తున్న వీఆర్ఏలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేసి ఆదుకోవాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేలమంది రెవెన్యూ గ్రామ సహాయకులు కీలకమైన రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమైన ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల 5 వందలు మాత్రమే జీతం ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చాలీచాలని జీతాలతో గ్రామ రెవెన్యూ సహాయకుల కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.

2017 మార్చ్ 24న విజయవాడ నగరంలోని అలంకార్ సెంటర్లో జరిగిన గ్రామ రెవెన్యూ సహాయకుల మహాదరణ కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, జీతాల పెంపుదలతో పాటు వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇదే విషయమై ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రెవెన్యూ సదస్సులో కూడా ఇదే విషయాన్ని గుర్తు చేయడం జరిగిందని తెలిపారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేలు కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23000 మంది గ్రామ రెవెన్యూ నాయకులకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా అర్హులైన వీఆర్ఏలకు రెవెన్యూ శాఖపరమైన పదవులలో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని కోరారు.

Next Story

Most Viewed