Kotam Reddy Sridhar Reddy: జైళ్లకు పంపినా..ఏం చేసినా రాజీపడను

by srinivas |
Kotam Reddy Sridhar Reddy: జైళ్లకు పంపినా..ఏం చేసినా రాజీపడను
X
  • ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా
  • చంద్రబాబు హయాంలో టీడీపీలో చేరితే మంత్రి అయ్యేవాడిని
  • కష్టాల్లో ఉన్న జగన్‌ను వదలకూడదని చేరలేదు
  • - వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ప్రజల సమస్యల పరిష్కారంపై పోరాటం ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడతా. జైళ్లకు పంపించుకున్నా, ఏం చేసినా, రాజీ పడేది లేదు. జైల్లు, లాకప్ లు ఎప్పుడో చూశాను. నాపై కోపంతో అయినా నెల్లూరు రూరల్‌లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రూరల్ నియోజకవర్గ పరిధిలో సమస్యలు పరిష్కరించగలిగితే నేనే నేరుగా వెళ్లి సీఎం జగన్‌కి పూలమాల వేస్తా. లేకపోతే పోరాటం తప్పదు’ అని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ‘ప్రస్తుతం తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను కాదని...అయినప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆరు నెలలు ఆగండి.. మంచిరోజులొస్తాయి’ అంటూ ప్రజలకు తెలియజేశారు. వచ్చే నెలనుంచి 141రోజుల ప్రజా ఆశీస్సుల యాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, కాల్వలు, పొట్టేపాలెం కలుజుపై వంతెనకోసం ఆయన శనివారం నిరసన చేపట్టారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ సమస్యల పరిష్కారించాలని కోరారు. కొమ్మరపూడి లిఫ్టి ఇరిగేషన్ పనులు, కొమ్మరపూడి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ప్రతిపక్షంలో ఉండగా 23మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారని, వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఆనాడు కష్టాల్లో ఉన్నా కూడా జగన్ చేయి వదిలిపెట్టలేదని..ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికార పార్టీ శాసన సభ్యుడిని అయినా కూడా ఏడాదిన్నరపాటు ఇంకా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నా కూడా పార్టీని వదిలిపెట్టినట్లు చెప్పారు. తాను ఆనాడు పార్టీ మారి ఉంటే మంత్రిని అయి ఉండేవాడిని ఇంతలా కష్టపడే వాడిని కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఏనాడూ సొంత లాభం కోసం చూసుకోలేదని ప్రజల కోసం ఆలోచించానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Next Story