సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై మత్స్య నారాయణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

by Disha Web Desk 16 |
సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై మత్స్య నారాయణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌
X

దిశ రాయలసీమ : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామివారు మత్స్యనారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి,శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి,టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు మూరంశెట్టి రాములు,మారుతిప్రసాద్, మధుసూదన్ యాదవ్,ఢిల్లీ స్థానికి స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవోలు స‌దాభార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం,సివిఎస్వో న‌ర‌సింహ‌కిషోర్‌,ఆలయ డెప్యూటి ఈవో ర‌మేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed