జనసేన, బీజేపీతో టీడీపీ జత కడితే... ఏపీలో జరిగిదే ఇదే!

by Dishanational1 |
జనసేన, బీజేపీతో టీడీపీ జత కడితే... ఏపీలో జరిగిదే ఇదే!
X

దిశ, ఏపీ బ్యూరో: నెలక్రితం శ్రీ ఆత్మ సాక్షి సర్వే ఫలితాలతో టీడీపీలో గుబులు మొదలైంది. జనసేన, బీజేపీతో జత కడితే ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టంగట్టే అవకాశాలున్నట్లు సర్వే వెల్లడించింది. జనసేనతో పొత్తు మాత్రమే టీడీపీకి అధికారం దక్కుతుందని పేర్కొంది. కమలనాథులతో కలిస్తే కేంద్ర సర్కారుపై వ్యతిరేకత మళ్లీ వైసీపీని గెలిపించే అవకాశమున్నట్లు ఈ సర్వే చెప్పింది. సంక్రాంతి తర్వాత తన తడాఖా చూపిస్తానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి కేంద్ర సర్కారుపై విమర్శనాస్ర్తాలు సంధిస్తారా అనేది ఆ పార్టీ కేడర్​లో చర్చనీయాంశమైంది. పండుగ తర్వాత చంద్రబాబు వ్యూహమేంటనేది రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నది.

టీడీపీ గురించి శ్రీ ఆత్మ సాక్షి సర్వేలో బీజేపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తే 60 నుంచి 75 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కేవలం జనసేనతో కలిసి పోటీ చేస్తే 100 నుంచి 120 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడించింది. 41 స్థానాల్లో టీడీపీ ఇన్‌చార్జులను మార్చాల్సిన అవసరమున్నట్లు తెలియజేసింది. ఈ సర్వే ప్రమాణికమెంతనేది పక్కన పెడితే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ నష్టపోతుందనే సంకేతాలు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పెల్లుబికుతున్న ప్రజా వ్యతిరేకతే కారణమై ఉండొచ్చని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు.

బీజేపీతో పొత్తు వల్ల ప్రధానంగా ముస్లిం మైనార్టీ వర్గాలు టీడీపీకి దూరమయ్యే అవకాశముంది. దేశవ్యాప్తంగా మత విద్వేషాలకు బీజేపీ ఆజ్యం పోస్తుందనే భావన ఆ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఈపాటికే బీజేపీతో వైసీపీ అంతర్గత మిత్రుత్వం కొనసాగిస్తుందని ఈ వర్గాలు ఉక్రోషంతో రగిలిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీతో చెలిమి వల్ల నష్టపోతామని తమ్ముళ్లు మదనపడుతున్నారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు నెరవేర్చని కమలనాథులతో కలిసి వేదిక పంచుకుంటే ప్రజలు ఛీ కొడతారని ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర భారాలు

కేంద్ర సర్కారు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్​ధరలు విపరీతంగా పెంచేయడంతో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. సామాన్య ప్రజల ఆహార సరుకులపై జీఎస్టీ పన్నులతో బాదేస్తున్నారు. విద్యుత్​సంస్కరణల పేరుతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. ప్రీపెయిడ్​స్మార్టు మీటర్లు ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దుతున్నారు. డిస్కంలను నీరుగార్జి విద్యుత్​పంపిణీని ప్రైవేటు చేతిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. థర్మల్​ప్లాంట్లకు అదానీ విదేశీ బొగ్గును అధిక ధరలకు కొనిపిస్తున్నారు. భవిష్యత్‌లో సామాన్యులకు కరెంటు మరింత ప్రియమవుతున్నది. ఇవిగాకుండా అర్బన్​సంస్కరణల పేరుతో ఆస్తి, ఇంటి పన్నులు పెంచేశారు. చివరకు చెత్తపై కూడా పన్ను విధిస్తున్నారు. మంచినీటికి మీటర్లు పెట్టి అమ్మేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా గడచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సగటు ప్రజలు పొదుపు చేసుకుంటున్న సొమ్మును నిత్యావసరాల కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని మోతిలాల్​ఓస్వాల్​సెక్యూరిటీస్​నివేదిక వెల్లడించింది.

బీజేపీతో పొత్తుల సెగలు?

ఇవన్నీ ఒక ఎత్తయితే మరోవైపు విశాఖ స్టీల్​ప్లాంటు అమ్మేయడానికే కట్టుబడి ఉన్నట్లు తేల్చేసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్​ఖండ్​తరహా ప్యాకేజీ ఇస్తామని ఇప్పుడు ఇస్తున్న అరకొర నిధులను కూడా నిలిపేసింది. దీంతో ఉత్తరాంధ్రలో బీజేపీ అంటేనే జనం భగ్గుమంటున్నారు. రైల్వే జోన్ ఊసే​లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీని అటకెక్కించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో నెలకొల్పేందుకు సిద్ధమైంది. రామాయపట్నం మేజర్ పోర్టును గాలికొదిలేయడంతో ఇక్కడ కూడా రాష్ట్ర సర్కారే ప్రైవేటు కంపెనీలతో కలిసి మినీ పోర్టు నిర్మిస్తున్నది. ఇలా బీజేపీ మీద ప్రజలు ఆగ్రహం పొత్తు పెట్టుకున్న పార్టీలకు సెగలు తగులుతాయన్న భయం తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. బీజేపీకి ఉన్న ఒక్క శాతం ఓట్ల కోసం పోతే అసలుకే మోసం వస్తుందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనే దానిపై టీడీపీలో చర్చనీయాంశమైంది.



Next Story

Most Viewed