ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్.. ధర్నాకు దిగిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌

by Bhoopathi Nagaiah |
ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్.. ధర్నాకు దిగిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండేళ్లు వెట్టిచాకిరి చేయించుకుని ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సివిల్స్ (SPO)ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్యాయం చేశారని, వెంటనే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ ధర్నాకు దిగారు. జోరున వర్షం వస్తున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్లకార్డులను ప్రదర్శిస్తూ గేటు ఎదుట రహదారిపై బైఠాయించారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయమే ఈ ప్రభుత్వం చేయవద్దని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సివిల్స్ రాష్ట్ర నాయకుడు ధర్మ చంద్, చిట్టిబాబు మీడియాతో మాట్లాడారు.

2020 జనవరి 2న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక జీవోను జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2156 మందిని ఎస్పీఓలుగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారని తెలిపారు. వీరిని బార్డర్ చెక్ పోస్టులు, నార్కోటిక్, ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాల్లో నియమించి విధులు అప్పగించారని తెలిపారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సివిల్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి, ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టామని గుర్తు చేశారు. కానీ 2022 మార్చి31 ఎలాంటి నోటీసు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీఓలను ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోయారు. మళ్లీ మమ్ముల్నీ విధుల్లోకి తీసుకోవాలని గత ప్రభుత్వంలోని సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టు తిరిగినా న్యాయం చేయలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమకు అండగా ఉంటామని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి ప్రభుత్వ అధికారులను, మంత్రులను కలిసి సమస్యను వివరించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్పీఓలు విధుల్లో లేకపోవడం వల్ల రాష్ట్రంలో గల్లీగల్లీకి గంజాయి దొరుకుతుందని, ఎర్ర చందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేయవద్దని సూచించారు. వెంటనే ఎస్పీఓలను విధుల్లోకి తీసుకోని రాష్ట్రంలో చెక్ పోస్టుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాలను అరికట్టాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ధర్మ చంద్, చిట్టిబాబు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed

    null