- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాడరేవులో అక్రమంగా రిసార్ట్స్ నిర్మాణాలు..?.. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

దిశ ప్రతినిధి, బాపట్ల: చట్టవిరుద్ధ నిర్మాణాలు చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో కొందరు చెలరేగిపోతున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్తువెత్తాయి.
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో విశాలమైన 28 గదులతో జి+1 భవనాన్ని బుద్ధ రిసార్ట్స్ నిర్మిస్తోంది. అయితే రిసార్ట్స్ యాజమాన్యం సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ కూడా తీసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. సముద్ర అలల రేఖ (హైటైడ్ లైన్)కు 30 మీటర్ల దూరంలోనే ఈ భవనాన్ని నిర్మిస్తున్నా పంచాయతీరాజ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భవనానికి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ సంబంధించి స్థానిక వాడరేవు గ్రామపంచాయతీ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ (ఓ.యు.డి.ఎ) నుంచి ఎటువంటి అనుమతి పొందలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే రిసార్ట్స్ యాజమాన్యానికి స్థానిక వాడరేవు గ్రామపంచాయతీ కార్యాలయం జనవరి 5న బుద్ధ రిసార్ట్ ప్రాంతీయ కార్యాలయం మేనేజర్ మల్లేటి శశాంక్‌కు నేరుగా నోటీసులు అందజేసి నిర్మాణాలను తొలగించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11న హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న యజమాని అయినాబత్తుని మంగాదేవికి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు పంపారు. కానీ ఈ రోజు వరకూ ఎలాంటి రిప్లై లేకపోవడంతో పంచాయతీరాజ్, రెవిన్యూ, పొల్యూషన్ బోర్డ్ శాఖల అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.
మరోవైపు సముద్ర తీరంలో నేరాలను అదుపు చేయడం కొరకు ఈనెల 12వ తేదీన చీరాల డిఎస్పి ఎండి. మొయిన్ ఆధ్వర్యంలో రిసార్ట్స్ యజమానులతో సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మత్స్యకార జీవన సంస్కృతిని పురోగతిలో నడిపించేందుకు కృషి చేసేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించినప్పటికీ జిల్లా యంత్రాంగంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. చీరాల నియోజకవర్గంలో సముద్ర తీరం వెంబడి అడ్డగోలుగా జరుగుతున్న రిసార్ట్స్ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని స్థానిక ప్రజా సంఘాలు, మత్స్యకార గ్రామాలు కోరుతున్నారు.
నాటి షిప్ & డిప్ బుద్ధ బీచ్ రిసార్ట్స్ & స్పా
1980లో కారంచేడుకు చెందిన జాగర్లమూడి హరిబాబు సముద్ర తీరంలో నిర్మించిన షిప్ అండ్ డిప్ నిర్మాణం చేశారు. అప్పట్లో షిప్ అండ్ డిప్ యాజమాన్యం రాజకీయ పలుకుబడి కారణంగా ప్రభుత్వ యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులలో పేకాట, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగాయని స్థానికులు చెబుతున్నారు. 2018 తర్వాత హరిబాబు కుమారుడు సురేష్ నుండి పందిళ్ళపల్లికి చెందిన పలగాని విజయ భాస్కర్ రెడ్డి కొనుగోలు చేసి బుద్ధ రిసార్ట్స్ గా నామకరణం చేశారు. 2024లో విజయభాస్కర్ రెడ్డి భార్య రశ్మిత నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉప్పల్ నివాసి అయినాబత్తుని మంగాదేవి కొనుగోలు చేశారు. పాత బుద్ధ రిసార్ట్స్ నిర్మాణాలను తొలగించి, చీరాల మండలం వాడరేవు గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 726/9,10 లలో పూర్తి విస్తీర్ణం య01:00 సెంట్లు భూమిలో బుద్ధ రిసార్ట్స్ నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్నది. ఇటీవల స్థానిక గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు ఇవ్వడం వలన ప్రస్తుతానికి నిర్మాణం పనులు నిలిచిపోయాయి.
ఐ.ఆర్.జి సంస్థ అక్రమ నిర్మాణాలు...
దిశ వరుస కథనాల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఐ.ఆర్.జి షిప్పింగ్ కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ భవన నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించినప్పటికీ, ఆ సంస్థ తాలూకు నిర్మాణాలు పూర్తిగా తొలగించలేదు. ఇప్పటికీ ఐ.ఆర్.జి షిప్పింగ్ కంపెనీ రెస్ట్ రూమ్ ఇతర నిర్మాణాలు హైటైడ్ లైన్ కు పది మీటర్ల దూరంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ తొలగించిన అధికార యంత్రాంగం రెస్ట్ రూమ్, ఇతర నిర్మాణాలను తొలగించకుండా వదిలివేయడంలో అంతరార్థం ఎవరికి అంతు చిక్కడం లేదు.
విద్యుత్ శాఖ తీరే వేరు...
సముద్ర తీర ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలో విద్యుత్ శాఖ అనుసరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. మామూళ్లకు అలవాటు పడిన విద్యుత్తు శాఖ అధికారులు సి. ఆర్. జెడ్. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా విద్యుత్ సౌకర్యం కల్పించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం సాంప్రదాయంగా మారింది. ఫిర్యాదులు చేసినప్పటికీ ఆక్రమణదారులకు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తూ న్యాయస్థానాల పరిధిలో ఉందంటూ ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందజేయటం అలవాటుగా చేసుకున్న విద్యుత్ శాఖ పనితీరుపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్షించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో ఇలా...
గతంలో పేరాలకు చెందిన యాతం ఆనందరావు కి సంబంధించి నిర్మాణంలో ఉన్న భవనాన్ని సి. ఆర్. జెడ్. నిబంధనల పేరుతో తొలగించడం జరిగింది. వాస్తవానికి హైటైడ్ లైన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న సదరు భవనాన్ని తొలగించిన ప్రభుత్వ యంత్రాంగం న్యాయస్థానం చివాట్లు తప్పలేదు. చివరికి నష్టపరిహారం కూడా ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల అమలు చేయడంలో భాగంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఆనందరావు భవనాన్ని తొలగించిన ప్రభుత్వ యంత్రాంగం, నేడు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రిసార్ట్స్ నిర్మాణాలకు సహకరించటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 100 మీటర్ల లోపు నిర్మించిన కృష్ణవంశీ లాడ్జికి సంబంధించి నిర్మాణంలో ఉన్న భవనం తొలగించి తాత్కాలిక షెడ్ నిర్మాణం చేసుకోవాలని గ్రామపంచాయతీ అధికారులు గతంలో నోటీసులు కూడా జారీ చేసి ఉన్నారు. కానీ అలాంటివేమీ జరగకపోవడంతో ఇప్పటికైనా ఇలాంటి అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.