తర్జన భర్జన..! కడప పార్లమెంట్ అభ్యర్ధి కోసం టీడీపీ వేట

by Disha Web Desk 1 |
తర్జన భర్జన..! కడప పార్లమెంట్ అభ్యర్ధి కోసం టీడీపీ వేట
X

దిశ ప్రతినిధి, కడప: వై నాట్ పులివెందుల ఏమో గాని కడప పార్లమెంటుకు అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ తల ప్రాణం తోకకు వచ్చేటట్లు కనిపిస్తోంది. ఏడాదిగా పార్లమెంటు అభ్యర్థి కోసం ఆ పార్టీ తర్జనభర్జన పడుతూనే ఉంది . ఇప్పటివరకూ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పార్లమెంటులో వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టేదెవరు, వ్యూహం ఎలా ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై రోజులు గడుస్తున్నా, పార్లమెంటు అభ్యర్థిపై ఆ పార్టీకి క్లారిటీ లేకపోవడంతో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. వారిపై సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి .ఈ తరుణంలో పార్లమెంట్ అభ్యర్థి పై స్పష్టత లేకపోవడంతో పార్టీ శ్రేణులతో పాటు, ఇప్పటికే అసెంబ్లీ టికెట్ ఖరారు అయిన అభ్యర్థుల్లో కూడా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు పార్లమెంట్ అభ్యర్థి అవుతారు? వారి ప్రభావం అసెంబ్లీలపై ఎలా ఉంటుంది !అనేదాన్ని బట్టి అసెంబ్లీ అభ్యర్థులు వ్యూహరచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న తరుణంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.

ఇప్పటికే ఆరుగురు..

తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే ఆరుగురు పేర్లు తెరమీదకి తెచ్చింది. అయినా అభ్యర్థి ఖరారు మాత్రం జరగలేదు. వ్యూహరచనలో ముందున్న వైసీపీ ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహం ఏమిటో కనిపించడం లేదు. ఏడాది క్రితమే కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పార్లమెంటుపై తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహంతో ఉందని భావించారు.

పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహం వ్యక్తం చేశారు. అయితే శ్రీనివాసరెడ్డి పార్లమెంటుపై అనాసక్తి వ్యక్తం చేస్తూ రావడం, దృష్టంతా ఆయన సతీమణి మాధవీరెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడప అసెంబ్లీ పైనే పెట్టడంతో పార్లమెంట్ పై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారిందనే చెప్పాలి. ఈ పరిస్తితుల్లో పార్టీ అధిష్టానం మరో అభ్యర్థిని ఖరారు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇప్పటివరకు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేర్లు కొంతకాలం వినిపించాయి. ఆ తర్వాత ఇటీవల కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరు శివారెడ్డి పేరు ఆ వరుసలో వినిపించింది.

వారం రోజుల క్రితం ఈయనపై సర్వే కూడా చేశారు. దీంతో వీర శివారెడ్డి పేరే ఖరారు అవుతుందని భావించారు. అయితే తాజాగా మంగళవారం జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్చార్జిగా ఉండి టిక్కెట్ తనకే అనుకున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి పై పార్లమెంట్ అభ్యర్థిగా సర్వే జరగడం ,ఆయనతో పాటు బద్వేలు మాజీ ఎమ్మెల్యే తనయుడు రితీష్ రెడ్డి పేరు పైనా సర్వే చేయడంతో కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు ? ఎప్పటిలోగా స్పష్టత ఇస్తారు అన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ గా మారింది

ఫలించని దేశం సునీత వ్యూహం..

తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుపై గట్టి స్కెచ్చే వేయాలని చూసింది. ఏడాది కిందట శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ పరిస్థితులు బట్టి మాజీ మంత్రి దివంగత వివేకానంద రెడ్డి కూతురిని బరిలో దించితే వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని, వైఎస్ కుటుంబంలోనే కొంత గందరగోళానికి ఈ వ్యవహారం దారి తీస్తుందని ప్రయత్నాలు చేసినట్లు చెప్పవచ్చు. ఇందులో భాగంగానే కడప పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా సునీత పోటీ చేస్తుందన్న ప్రచారం కూడా బాగా జరిగింది.

అయితే, మొన్నటి వరకు ఆ ప్రచారం జరిగినప్పటికీ ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాక సునీత తల్లి సౌభాగ్యమ్మను టీడీపీ తరఫున పోటీ చేయిస్తారని ప్రచారం సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సభలో వారి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ భావించినా వారు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సన్నగిల్లి పోయింది.

క్లారిటీ వచ్చేనా..

మరి పార్టీ శ్రేణులు కోరుకున్నట్టుగా ఒకటి రెండు రోజుల్లో అయినా కడప పార్లమెంటు, జమ్మలమడుగు అసెంబ్లీ పైన స్పష్టత వస్తుందేమో చూడాలి. ఒకవేళ భూపేష్ రెడ్డి ఆయన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి లు ఇద్దరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా ఒకరు పోటీ చేస్తే ఆ ఇద్దరికి కూడా జమ్మలమడుగు అసెంబ్లీలో ప్రయోజనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తెలుగుదేశం అదినేత చంద్రబాబు కడప పార్లమెంటు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, సందిగ్ధానికి ఎప్పటికి తెర దించుతారో చూడాలి.

Read More..

జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక సందేశం


Next Story

Most Viewed