మహిళల ఫోటోలను వలంటీర్లు తీస్తున్నారు..వలంటీర్ వ్యవస్థ క్యాన్సర్ గడ్డలాంటిది: MP Raghu Rama Raju

by Disha Web Desk 21 |
మహిళల ఫోటోలను వలంటీర్లు తీస్తున్నారు..వలంటీర్ వ్యవస్థ క్యాన్సర్ గడ్డలాంటిది: MP Raghu Rama Raju
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖలో వలంటీర్ వెంకటేశ్ ఘాతుకంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వరలక్ష్మి అనే వృద్ధురాలిని వెంకటేశ్ హతమార్చిన వార్త వినడం దురదృష్టకరమన్నారు. బాధ్యత లేని వ్యక్తులను ఊర్లపైకి, ఇళ్ల మీదకు సీఎం జగన్ వదిలేశారని..దాని ఫలితమే ఇలాంటి దురాగతాలకు కారణమని అన్నారు. ఈ హత్యలో వైసీపీ నేతలంతా భాగస్వాములమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర నుంచి ఎంపీలు కూడా బాధ్యులేనని అన్నారు. ఈ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేవారు. వలంటీర్లు ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించడం తప్ప వారు చేస్తున్న పని ఏముందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల ఫొటోలను కూడా వలంటీర్లు తీసుకుంటున్నారని దాని పర్యవసానాలు ఎంతవరకు వెళ్తాయోనన్న ఆందోళణ కలుగుతుందని అన్నారు. పింఛన్‌ను వార్డు మెంబర్ కూడా ఇవ్వొచ్చని లేదా పింఛన్ డబ్బులను అకౌంట్లలో వేయవచ్చని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. మరోవైపు మచిలీపట్నంలో ఒక ఇంటి నంబర్ పై 500 దొంగ ఓట్లను నమోదు చేశారని ఆరోపించారు. దొంగ ఓట్లు ఉన్న వారి పింఛన్ ఎవరి ఎవరి అకౌంట్లలోకి వెళ్తోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. వలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ప్రభుత్వమే కేసు వేయడం సిగ్గు చేటని విమర్శించారు. వలంటరీ వ్యవస్థను ఒక క్యాన్సర్ గడ్డ మాదిరి జగన్ ప్రవేశపెట్టారంటూ ధ్వజమెత్తారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు వలంటరీ వ్యవస్థ ఎందుకని ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.

ఇవి కూడా చదవండి వలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ఇన్ఫినిటీ :వలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసిన జనసేన



Next Story

Most Viewed