ఒకే వేదికపై మోడీ, పవన్, చరణ్.. మరింత స్పెషల్‌గా చంద్రబాబు ప్రమాణం

by Gantepaka Srikanth |
ఒకే వేదికపై మోడీ, పవన్, చరణ్.. మరింత స్పెషల్‌గా చంద్రబాబు ప్రమాణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమైంది. బుధవారం(12-06-2024) రోజున గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఐటీ టవర్స్‌ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు సైతం అందజేశారు. సినీ, రాజకీయ, క్రీడా రంగం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపించారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు సమచారం. ఆహ్వానం అందిన వెంటనే వెళ్లాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది.

మరోవైపు ఈ మహా ఘట్టంలో చంద్రబాబుతో పాటు కేబినేట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, రవాణాకు అంతరాయం ఏర్పడకుండా, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు నిర్ణయించుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు.

Next Story

Most Viewed