ఎక్సైజ్ అధికారుల వింత చేష్టలు? నిందితులను వదిలి, కాపలాదారుల అరెస్టు

by Dishanational2 |
ఎక్సైజ్ అధికారుల వింత చేష్టలు? నిందితులను వదిలి, కాపలాదారుల అరెస్టు
X

కర్నూలు జిల్లాలోని ఆలూరు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది వింత చేష్టలతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజక వర్గ కేంద్రానికి సమీపంలో కర్ణాటక రాష్ర్టం ఉండడంతో అక్కడి మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమ మద్యాన్ని పట్టుకున్న అధికారులు అసలు నిందితులను వదిలి కాపలాగా ఉన్న వారిని పట్టుకుని అరెస్టు చూపడం పలువిమర్శలకు తావిస్తోంది. నిందితులు బహిరంగంగా తిరుగుతున్నా వారిని అరెస్టు చేసేందుకు వారికి ధైర్యం చాలడంలేదు. ఇలాంటి తంతే ఇటీవలి కాలంలో ఎదురైంది.


దిశ, కర్నూలు ప్రతినిధి: కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ కేంద్రం అక్రమ మద్యం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. సమీపంలోనే కర్ణాటక రాష్ర్టం ఉండడంతో అక్కడి నుంచి మద్యాన్ని తెచ్చుకుని విక్రయించడం పరిపాటిగా మారింది. వీటిని నివారించేందుకు ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ తమవంతు విధులు నిర్వహించకుండా అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తోంది. ఇక్కడ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎలాంటి పనులు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం ఎక్సైజ్ అధికారులకు అలవాటైంది.వారం క్రితం ఆలూరు పట్టణానికి సమీపంలో బళ్లారి రహదారిలో ఉన్న మిత్ర వాటర్ ప్లాంట్ దగ్గర గద్దెరాళ్ల మారెమ్మ అవ్వ జాతర సందర్భంగా అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన 50 కర్ణాటక మద్యం బాక్సులను ఎక్సైజ్ అధికారులు ఎంతో ఉత్సాహంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.

అయితే కర్ణాటక నుంచి తెచ్చి అక్కడ ఉంచిన ముగ్గురు ప్రధాన నిందితులనువదిలి వాటికి కాపలాగా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం పలు విమర్శలకు తావిస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఒకరు ఆలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోనైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు పరారీలో ఉన్న వ్యక్తి కాలేజి దగ్గర విధులు నిర్వహిస్తున్నారా? లేక పరారీలో ఉన్నారా? ఉంటే ఆయనపై కళాశాల అధికారులు చర్యలుతీసుకున్నారా? అని ప్రజలకు సందేహం కలుగకమానదు. అలాగే ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో పరారీలో ఉన్న వ్యక్తి ఓటు కూడా వేశారు. అయినా ఎక్సైజ్ అధికారులు వారిని అరెస్టుచేసేందుకు వెనుకాడుతున్నారు. ఆ ముగ్గురులో మరొకరు ఆలూరు సొసైటీ చైర్మన్ కుమారుడు కూడా ఉండడం విశేషం. అక్రమ మద్యం కేసుల్లో కొన్ని సార్లు మద్యం లేకున్నా కేసులు పెట్టిరిమాండ్‌కు తరలించే అధికారులు నిజంగా మద్యంతో పట్టుబడితే ఇంతవరకు అరెస్టు చేయకపోవడం, చేసినా అరెస్టు చూపకపోవడంతో ఎక్సైజ్ అధికారులకు వారిపట్ల ప్రేమ ఉందా? లేకభయపడుతున్నారా ? అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఆలూరు ఎక్సైజ్ అధికారులు మద్యం మాఫియాను చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారన్నఆరోపణలు లేకపోలేదు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు నిందితులను పట్టుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందువల్ల జిల్లా అధికారులు స్పందించి అసలు నిందితులను పట్టుకుని ఎక్సైజ్శాఖపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుని ప్రజలకు ఈ శాఖ పట్ల నమ్మకాన్ని కల్గించేలా చర్యలు తీసుకోవాలని, అదే క్రమంలో కర్ణాటక నుంచి వచ్చే అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్టవేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Next Story