చంద్రబాబు అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

by sudharani |
చంద్రబాబు అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
X

‘గత ప్రభుత్వంలో శాసనసభ ఆమోదించిన పథకాన్ని అమలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి దోషి ఎలా అవుతారు ! ఈ ప్రభుత్వానికి ఇదేం పోయేకాలం..! ’ అంటూ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న తటస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్​పై టీడీపీ శ్రేణుల నిరసనలు మిన్నంటుతున్నాయి. తెలంగాణ, కర్నాటకతోపాటు విదేశాల్లోని ఐటీ నిపుణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రశ్నలు సంధిస్తే వైసీపీ సోషల్​ మీడియా సమాధానాలు ఇవ్వడానికి బదులు దుర్భాషలతో ఎదురు దాడి చేస్తోంది. మరోవైపు జగన్​ కు వ్యతిరేకంగా నిలిచే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని పీటీఐ ఇంటర్వ్యూలో నారా లోకేష్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్​ను నిరసిస్తున్న గళాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. పొరుగునున్న కర్నాటక, తెలంగాణలోని ఐటీ నిపుణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో టీడీపీ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఇది విదేశాలకూ పాకింది. బెల్జియంలో ఎన్నారైలు తాము సైతం బాబుకు తోడుగా నిలుస్తామంటూ ప్లకార్డులతో సంఘీభావం తెలిపారు. వీరితో జనసేన అభిమానులు కలిశారు. ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​లో ఎన్నారైలు నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగు అసోసియేషన్లు నిరసన ర్యాలీ నిర్వహించాయి.

ప్రశ్నిస్తే దుర్భాషలా..?

ఇంకోవైపు వైసీపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు అరెస్టును సమర్థిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వైసీపీ శ్రేణులు సీఐడీని బలపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా స్కిల్​ డెవలప్​మెంటు కేసు పూర్వాపరాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. నిధుల వ్యయంలో సంతకాలు చేసిన అధికారులను వదిలేసి చట్టం చేసిన మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేస్తారని సీఐడీ చీఫ్​ సంజయ్​ను ప్రెస్​ మీట్లో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. ఈ కేసుకు సంబంధించి సోషల్​ మీడియాలో టీడీపీ శ్రేణులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. వైసీపీకి చెందిన వాళ్లు కొందరు ఓపిగ్గా సమాధానం చెబుతుంటే మరికొందరు దుర్భాషలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఇది తటస్థులను అసహనానికి గురి చేస్తోంది.

లోకేశ్ వ్యాఖ్యలతో అలజడి..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్​ ను వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి తాము దూరమని ప్రకటిస్తే ఇండియా కూటమి పార్టీలు మద్దతునిస్తాయి. బీజేపీతో చెలిమికి సిద్దపడితే జనసేన మాత్రమే స్నేహ హస్తం అందిస్తుంది. ఇప్పటికైతే బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు.

జనసేనాని మాత్రం మోడీ, అమిత్​ షాలతో మాట్లాడి కలిసి పోటీ చేసేందుకు ఒప్పిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్​ విషయంలో కేంద్రానికి తెలీకుండా జగన్​ సర్కారు అంతటి సాహసం చేయలేదని రాష్ట్రం కోడై కూస్తుంటే.. అదంతా అసత్య ప్రచారమని పురందేశ్వరి ఖండిస్తున్నారు. కేంద్ర పెద్దలు మాత్రం ఇప్పటికీ నోరు మెదపడం లేదు. ఢిల్లీ పెద్దలు పొత్తుల విషయం తేల్చేదాకా ఈ గందరగోళం కొనసాగుతుందని విశ్లేషకుల అంచనా.Next Story

Most Viewed