Breaking News: ఆ ప్రకటనలు ఇస్తున్నారా..?అయితే ఇది తప్పనిసరి..

by Disha Web Desk 3 |
Breaking News: ఆ ప్రకటనలు ఇస్తున్నారా..?అయితే ఇది తప్పనిసరి..
X

దిశ,ప్రతినిధి: ఎన్నికల కోడ్ సెగ మీడియాకు కూడా తగిలింది. ఆంధ్రప్రదేశ్ జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మీడియా ప్రకటనల విషయంలో ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని మచిలీపట్నం జిల్లా అధికారులు ఆదేశాలు జరీ చేశారు. వివరాలోకి వెళ్తే.. మచిలీపట్నం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పి రాజాబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరించి జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు, చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, మీడియా ఉల్లంఘనలు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

రిజిస్టర్ కాబడిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు గానీ వాళ్ళ తరఫున ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందుట కోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేయుటకు 3 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలానే రిజిస్టర్ కానటువంటి రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులను, వాళ్ళ ప్రకటనలను ప్రసారం చేయుటకు 7 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇక దరఖాస్తు అందిన రెండు రోజుల్లోగా జిల్లాస్థాయి ఎంసీఎంసీ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని తెలిపారు. కాగా వార్తాపత్రికల్లో పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుండి అనుమతి పొందిన తరువాతే ప్రకటన ప్రచురించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి అన్ని రకాల టెలివిజన్ ఛానళ్లు, కేబుల్ నెట్వర్క్ లు, డిజిటల్ డిస్ప్లేలు, మొబైల్ నెట్వర్క్ ల ద్వారా ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్ లు వస్తాయని, అలాగే సామాజిక మాధ్యమాలైన (సోషల్ మీడియా) ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇంస్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్ వెబ్సైట్లు, వికీపీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి వస్తాయని తెలిపారు.

అలాగే సినిమా హాళ్లలోనూ, ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలలో, ఎలక్ట్రానిక్ పత్రికలలోను ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా తప్పనిసరిగా ముందస్తు ధ్రువీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. అనుమతి పొందిన ఆర్డర్ నంబర్ను సంబంధిత ప్రకటనపై సూచించాల్సి ఉంటుందన్నారు ఈ విషయాన్ని అన్ని ప్రసారమాధ్యమాలు గమనించాలని సూచించారు.

ఎంసీఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రసారాలు, ప్రకటనలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి, భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.


Next Story

Most Viewed