తప్పుడు ప్రచారాలపై మంత్రి సురేష్ తీవ్ర ఆవేదన​

by srinivas |
తప్పుడు ప్రచారాలపై మంత్రి సురేష్ తీవ్ర ఆవేదన​
X

దిశ, ఏపీ బ్యూరో: అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అది నిజమై పోతుందనుకోవడం వాళ్ల భ్రమే అవుతుందని మంత్రి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొందరి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నానంటూ తనపై ఎమ్మెల్యే స్వామి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. తానేంటో.. తన స్వభావమేంటో ప్రజలకు తెలుసని కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల కోసం తాను సొంతంగా ముద్రించి ఇచ్చిన పుస్తకాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల కోసం అధికారుల నుంచి డబ్బు తీసుకున్నానని ప్రచారం చేయడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల ఏ మేరకు రాజకీయ లబ్ది జరుగుతుందో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు సురేష్ తెలిపారు.

దాదాపు 40 ఏళ్లుగా విద్యాసంస్థలు నడుపుతూ విద్యార్థుల కోసం తాను చేపట్టిన కార్యక్రమాలు పరిశీలిస్తే తానేంటో తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. యండమూరి వీరేంద్రనాథ్​ లాంటి ఎందరో ప్రముఖులతో విద్యార్థుల కోసం ప్రేరణ తరగతులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరీక్షల సమయంలో చేపట్టే కార్యక్రమాలు కానీ, ఉచితంగా నోట్ పుస్తకాల పంపిణీ, ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ఉచిత విద్య అందించే విద్యావంతుల కుటుంబం తమదని చెప్పారు. పుస్తకాలు ముద్రించడానికి, లేదా ఇతర కార్యక్రమాలకు ఆర్ధికంగా ఎవరిమీదో ఆధారపడాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. కొండపి నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే స్వామి తననే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని సురేష్ తెలిపారు. జగనన్నపై ఉన్న విశ్వాసంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రజలు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి సురేష్ హెచ్చరించారు.



Next Story

Most Viewed