పేరు మార్చాలనుకుంటే విశాఖ కేజీహెచ్ పేరు మార్చుకోండి: పవన్ కల్యాణ్

by Disha Web Desk 22 |
పేరు మార్చాలనుకుంటే విశాఖ కేజీహెచ్ పేరు మార్చుకోండి: పవన్ కల్యాణ్
X

దిశ, ఏపీ బ్యూరో : ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్ఆర్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ.. రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోతాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవం. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవు. సిబ్బంది అందుబాటులో లేరు. మెడిసిన్ అందుబాటులో ఉండవు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగి.. డా.సుధాకర్‌ని వేధించడంతో మానసిక వ్యధకి లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదని పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ మేరకు బుధవారం ఓప్రకటన విడుదల చేశారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదని విమర్శించారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో.. కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉందని అభిప్రాయపడ్డారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని సూచించారు. పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్య్ర అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

ఈ పాలకులకు యల్లాప్రగడ సుబ్బారావు పేరు తెలుసా ?

ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిగణించేవారు అని అన్నారు. బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త.. మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులుపెట్టారా? అని నిలదీశారు. ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలి అని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

Next Story