పవన్ పోటీ ఎక్కడి నుంచి?

by Disha Web Desk 4 |
పవన్ పోటీ ఎక్కడి నుంచి?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు. కాకినాడ జిల్లాలో అతను కన్ను ఏ నియోజకవర్గంపై పడింది అనే విషయంపై అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతుంది. మొన్నటి దాకా పిఠాపురం అని పుకార్లు వచ్చినా, తాజాగా కాకినాడ రూరల్ అని పక్కా సమాచారం వచ్చినట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ క్యాడర్ అంతా కాకినాడ రూరల్‌పై దృష్టి సారించారు. ఎలాగైనా పవన్ కల్యాణ్‌ను ఓడించాలని వ్యూహాలు రచిస్తున్నారు. గెలుస్తాడనే నమ్మకం ఉంటే ఏ పార్టీలో ఉన్నా ఆహ్వానించుకొని ఖచ్చితంగా గెలుపించుకోవాలనే ఉద్దేశ్యంలో పార్టీ ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కన్నబాబుకు ఈ సారి సీటు దక్కకపోవచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అంతా జనసైన వైపునకే చేరుతుంది. ఇప్పటికే 70 శాతం కాపులు జనసైనికులుగానే ఉన్నారు. నూటికి నూరు శాతం పవన్ గెలుపు ఖాయం. ఈ నేపథ్యంలో బీసీలకు గాలం వేసే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. బీసీలకు ఇక్కడి స్థానం కేటాయిస్తే కాపులకు ధీటుగా ఉంటుందని, ఎస్సీ, మైనార్టీ, ఇతర కులాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేకు శత్రుపోరు

అధికార సిట్టింగ్ శాసన సభ్యుడు కన్నబాబుకు శత్రు పోరు అధికమైందనే ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని అనేక మంది అంటున్నారు. కాకినాడ సిటీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితోనూ ఆయనకు విభేదాలు ఉన్నాయి. ఈసారి కన్నబాబు స్థానంలో బీసీ కోటాలో వేరే వ్యక్తికి సీటు ఇవ్వనున్న సంకేతాలు అధిష్టానం ఇస్తుంది. పార్టీలో కింగ్ మేకర్లతో ఆయనకు సఖ్యత లేకపోవడంతో వేరే చోట సీటు ఇవ్వమని సిఫారసు చేసే పరిస్థితీ కనబడటం లేదు.

బీసీ నేతల వైపు వైసీపీ చూపు

ఈ పరిణామాల నేపథ్యంలో బీసీ నేత, మాజీ శాసన సభ్యుడు పిల్లి సత్యనారాయణమూర్తిని వైసీపీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో జిల్లాకు చెందిన ఒక శాసన సభ్యుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఈయన మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో అసమ్మతి కూడా ఉంది. ఈ తరుణంలో సత్యనారాయణ మూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా ఉంది. ఈయనకు సీటు ఇస్తే గెలుపు లేకపోయినా కనీసం డిపాజిట్లు గల్లంతవ్వకుండా ఉంటాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, కాకినాడ రమ్య హస్పిటల్ అధినేత, వైసీపీ డాక్టర్ల వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పితాని అన్నవరం కూడా కాకినాడ రూరల్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన మండపేట సీటు ఆశించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ వర్గానికి చెందిన రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసుకు ఆ స్థానం అప్పజెప్పారు. దీంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం రూరల్ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు సీటు ఖాయమైందనే ప్రచారం కూడా చేసుకుంటున్నారు.

Also Read...

కుప్పం కేంద్రంగా చంద్రబాబు భారీ స్కెచ్!

Next Story