పత్తాలేని జనసేన: పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా కనికరించని ఓటర్లు

by Disha Web Desk 21 |
Pawan Kalyan to start statewide tour from tirupati on october 5
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పత్తా లేకుండా పోయింది. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సైతం ఎక్కడా తమ ప్రభావం చూపించడం లేదు. కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి 8 స్థానాలను ఇచ్చింది. దీంతో ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. అటు బీజేపీ ఇటు జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. అయినా ఎక్కడా కూడా జనసేన పార్టీ తన సత్తాచాటలేకపోయింది. కౌంటింగ్‌ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా.. ఒకవైపు అభ్యర్థుల విజయాలు వెల్లడవుతున్నా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరినా ఓటర్లు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ గెలుస్తారని జనసైనికులు గట్టిగా నమ్మారు. కేవలం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా జనసైనికులు హైదరాబాద్ వెళ్లి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ కూడా జనసేన వెనుకంజలో ఉంది. దీంతో తెలంగాణలో టీడీపీ మాదిరిగానే జనసేన సైతం త్వరలోకనుమరుగు అవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కల్యాణ్ అభ్యర్థులను బరిలోకి దించి గట్టి సాహసమే చేశారని కొందరైతే ఎన్నికలకు దూరంగా ఉన్నారని మరికొందరు అభినందిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్కస్థానంలోనైనా జనసేన గెలిస్తే ఏపీలో ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని అంతా భావించారు. కానీ అలాంటి పరిస్థితి రాలేదు. పత్తా లేకుండా పోవడంతో జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed