జగన్‌కి 29 సీట్లే...వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తా: సినీ నిర్మాత

by Seetharam |
జగన్‌కి 29 సీట్లే...వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తా: సినీ నిర్మాత
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 29 స్థానాల్లోనే గెలుపొందుతుందని సినీ నిర్మాత నట్టికుమార్ జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ-జనసేన పొత్తును స్వాగతిస్తున్నట్లు సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. త్వరలోనే తాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవబోతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తన రాజకీయ కార్యచరణను ప్రకటిస్తానని నట్టికుమార్ తెలిపారు.

నేను సినిమా తీస్తా

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సినీ నిర్మాత నట్టికుమార్ మరోసారి ధ్వజమెత్తారు. రామ్ గోపాల్ వర్మ ఏదీ ఫ్రీగా తీయరని.. డబ్బులు ఇస్తేనే సినిమా తీస్తారని చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు కాబట్టే వ్యూహం సినిమా తీశాడని చెప్పుకొచ్చారు. వైసీపీ డబ్బులు ఇచ్చి సినిమా తీయించుకుంది కాబట్టి వైసీపీ పట్ల ఆర్జీవీ ఖచ్చితంగా సానుభూతి ఉంటుందని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకోవడం పొరపాటు అని చెప్పుకొచ్చారు. సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పుకొచ్చారు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను తాను కూడా చూస్తానని..అనంతరం వైసీపీకి వ్యతిరేకంగా తాను కూడా సినిమా తీస్తానని ప్రకటించారు. తాను తీయబోయే సినిమాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగింది? ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎలా చిత్రహింసలు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అరాచకాలు చేసింది వంటి పలు అంశాలను ఇతివృత్తంగా చేసుకుని సినిమా తీస్తానని వెల్లడించారు. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కుట్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తానని సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

టీడీపీవైపే టాలీవుడ్

సినీ రంగం మెుత్తం టీడీపీ వైపే ఉందని చెప్పుకొచ్చారు. త్వరలోనే చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు టీడీపీకి మద్దతుగా బయటకు వస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీతోనే మంచి జరుగుతుందని అందువల్లే తాను కూడా టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు సినీ నిర్మాత నట్టికుమార్ తెలిపారు.

Next Story

Most Viewed