అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదు : బీఆర్ నాయుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-23 11:29:44  IST  )

తిరుమలకు (Tirumala) వచ్చే భక్తులకు అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) స్పష్టం చేశారు.

అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదు : బీఆర్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలకు (Tirumala) వచ్చే భక్తులకు అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) స్పష్టం చేశారు. టోకెన్లు లేకుంటే తిరుమలకు రానివ్వరంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొందరు పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. డిసెంబరు 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. ఈ నేపథ్యంల టోకెన్లు ఉన్నవారికే అనుమతి అంటూ కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు.

ఈ విషయంపై టీటీడీ చైర్మన్ స్పందిస్తూ తిరుమలలో వైకుంఠద్వార దర్శన ఏర్పాట్ల కోసం రెండు నెలల నుంచి పని చేస్తున్నాం అన్నారు. గత అనుభవాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిందన్నారు. జనవరి 2 నుంచి టోకెన్లు లేకుండా భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుందని వివరించారు. భక్తులెవ్వరూ దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు.

ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు.

దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిన్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు. టోకెన్ పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనానికి రావాలని సూచించారు. ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.

ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని చైర్మన్ వెల్లడించారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామని స్పష్టం చేశారు. చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని తెలిపారు.

వైకుంఠ ద్వార దర్శనాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే కారణంగా చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని చెప్పారు. భక్తులందరూ టీటీడీ సూచనలు పాటిస్తూ సంయమనంతో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలని తెలియజేశారు.

Next Story