AP Politics: ఆ విషయంలో స్తంభించిన అధిష్టానం.. అయోమయంలో ఏపీ బీజేపీ

by Disha Web Desk 3 |
AP Politics: ఆ విషయంలో స్తంభించిన అధిష్టానం.. అయోమయంలో ఏపీ బీజేపీ
X

దిశ డైనమిక్ బ్యూరో: బీజేపీ అధిష్టానం వైకిరి అటు కలవదు ఇటు వదలదన్న తీరుగా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ జనసేన ఎప్పుడో పొత్తు ప్రకటించాయి. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు కూడా చేస్తున్నాయి. అయితే టీడీపీ, జనసేనతో పొత్తులో బీజేపీ కూడా కలుస్తుందనే ఆశాభావాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో పొత్తు కుదిరితే సీట్లు సంపాదించుకునే అవకాశం ఉందని కొంతమంది బీజేపీ ఆశావహులు భావిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం పొత్తు విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అటు పొత్తుకు అంగీకారం తెలపలేదు ఇటు పొత్తు కుదరదని తేల్చి చెప్పలేదు. ఏ విషయం చెప్పకుండా జిడ్డు రాజకీయం చేస్తోందని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనితో ఏపీ బీజేపీ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే అధిష్టానం వైకిరికిపై అసహనానికి గురైన బైరెడ్డి శబరి, భూమా కిషోర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అలానే రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి మెజారిటీ స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కమలం లీడర్లు సిద్ధమవుతున్నారు.

అయితే అధిష్టానం ఇలానే సాగతీత ధోరణితో వ్యవహరించడం పార్టీ నేతలకు నచ్చడం లేదని సంబంధిత వర్గాల సమాచారం. ఇంకో వారంలో ఎన్నికల కోడు కూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం ప్రెస్ మీట్లకే పరిమితమవ్వడం.. ఇప్పటి వరకు ఒక్క ప్రచార కార్యక్రమంగానీ, బహిరంగ సభ కానీ నిర్వహించకపోవడం ఏపీ బీజేపీ నేతేల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధిష్టానం ఓ నిర్ణయానికి వస్తుందో లేదో చూడాలి.




Next Story

Most Viewed