ఆ లెక్కలన్ని బయటకు తీస్తాం: విడదల రజినికి ఎమ్మెల్యే పత్తిపాటి ఘాటు కౌంటర్

by srinivas |   ( Updated:2025-02-08 14:56:01.0  )
ఆ లెక్కలన్ని బయటకు తీస్తాం: విడదల రజినికి ఎమ్మెల్యే పత్తిపాటి ఘాటు కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి విడదల రజిని(Former Minister Rajini) అవినీతి లెక్కలన్ని బయటకు తీస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు(Chilakaluripet MLA Pattipati Pullarao) హెచ్చరించారు. తనపై విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎన్నికలు జరిగిన 7 నెలల తర్వాత వచ్చి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు సీటు కేటాయించగానే ఆమె అక్కడికి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. విడదల రజిని, ఆమె ఫ్యామిలీ ఎక్కడెక్కడ ఏమేం చేశారో అన్ని బయటపెడతామన్నారు. ఎక్కడ స్థలం కనిపించినా దాన్ని కబ్జా చేసి చిలకలూరిపేటను లూటీ చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టించిందే విడదల రజిని అని పత్తిపాటి గుర్తు చేశారు. మైకులు ముందు మాట్లాడటం కాదని, అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈ రోజు నీతులు మాట్లాడటం సరికాదన్నారు. విడదల రజినిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. పురుషోత్తంపట్నం లాంటి మంచి గ్రామాన్ని కూడా మోసం చేశారని విమర్శించారు. ఓటు వేసిన చిలకలూరిపేట ప్రజలను కూడా మోసం చేశారని మండిపడ్డారు. 400 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు తేలిందని, వాటన్నింటిని బయటకు తీస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

కాగా విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆమె పీఏలు ఎన్‌.జయ ఫణీంద్ర, రామకృష్ణ, అప్పటి చిలకలూరిపేట అర్బన్‌ సీఐ వి.సూర్యనారాయణపై సైతం కేసు నమోదైంది. రజిని చట్ట వ్యతిరేక వ్యవహారాలకు సంబంధించి చిలకలూరిపేటకు చెందిన టీడీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పిల్లి కోటి 2019లో పార్టీ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు కోటిని ఐదు రోజులు పాటు చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేశారు. నాటి ఘటనపై పోలీసులకు ఆయన తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విడదల రజినితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. దీంతో ఇందుకు కారణం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అంటూ విడదల రజిని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టమని మండిపడ్డారు. విడదల రజిని చేసిన ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Next Story

Most Viewed