ఏపీలో ట్రెండింగ్ బిజినెస్: పొలిటికల్ నాయకుల ఫోటోలతో క్రాకర్స్..ఎగబడి కొంటున్న జనం

by Disha Web Desk 21 |
ఏపీలో ట్రెండింగ్ బిజినెస్: పొలిటికల్ నాయకుల ఫోటోలతో క్రాకర్స్..ఎగబడి కొంటున్న జనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అంశం రాజకీయంతో ముడిపడిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడినా అంతా రాజకీయమే అంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా వ్యాపార రంగంలోకి కూడా రాజకీయం ఎంటరైపోయింది. అంటే రాజకీయ నాయకుల వ్యాపారాల్లో ఐటీ, ఈడీ దాడులు గురించి అనుకున్నేరు. అలాంటిది కాదు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులను ఆకర్షించుకునేలా...తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకునేందుకు వ్యాపారస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు, పార్టీల పేరుతో క్రాకర్స్‌ను మార్కెట్లోకి వదిలారు వ్యాపారస్థులు. దీంతో ఆయా పార్టీల అభిమానులు తమ అభిమానుల ఫోటోలు, పార్టీల పేర్లతో మార్కెట్లోకి వచ్చిన క్రాకర్స్ కొనుగోలు చేసి సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ దీపావళి క్రాకర్స్‌లోకి రాజకీయ నాయకులు, పార్టీలు సైతం ఎంటర్ అవ్వడం కొత్త ట్రెండ్‌గా మారింది. మెుత్తానికి వ్యాపారస్థులు తమ వ్యాపార అభివృద్ధి కోసం సరికొత్తగా ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

వ్యాపారం జోరుగా..

2024లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ హడావిడి నెలకొంది. ఈ హడావిడిని.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి క్రాకర్స్‌ను అమ్ముకునేందుకు వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రాజకీయ నాయకుల ఫోటోలతో క్రాకర్స్‌ మార్కెట్‌లోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి పండుగ వేళ క్రాకర్స్‌ను క్యాష్‌ చేసుకునేందకు రాజకీయ నేతల ఫోటోలు, పేర్లతో అట్టలపై ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. ఈ తరహాలోనే ప్రకాశంజిల్లా జరుగుమల్లి మండలంలోని ఓ చిన్న గ్రామం కామేపల్లిలో సైతం క్రాకర్స్ దుకాణంలో వివిధ పార్టీ నాయకుల చిత్రాలతో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దివంగత రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ ఫోటోలు, పేర్లతో క్రేకర్స్ వెలిశాయి. అలాగే అన్న నందమూరి తారక రామారావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల పార్టీలు, పేర్లతో క్రాకర్స్ మార్కెట్లో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి ఫోటో ముద్రించిన క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది.

కనిపించని చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు

ఒకప్పుడు, సెలబ్రిటీలు, సినీతారల పేర్లతో క్రాకర్స్‌ మార్కెట్లోకి రావడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా రాజకీయ నేతలు, పార్టీల పేర్లతో క్రాకర్స్‌ను అమ్ముకోవడం ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్ ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ముద్రించిన క్రాకర్స్‌ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్యాకేట్లపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అన్న ట్యాగ్‌ని కూడా ముంద్రించి బీజేపీ కార్యకర్తలను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఏపీలో కూడా క్రాకర్స్‌‌పై సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ఆర్‌, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌ ఫోటోలను ముద్రించి అమ్మేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ల ఫోటోలతో కానీ టీడీపీ పేర్లతో కానీ క్రాకర్స్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed