నారా లోకేశ్‌కు జన నీరాజనం: యువగళం@3000కి.మీ

by Disha Web Desk 21 |
నారా లోకేశ్‌కు జన నీరాజనం: యువగళం@3000కి.మీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగాల్లేక నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు... అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలు మరోవైపు..ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా తిరిగివస్తామనే గ్యారంటీలేక భయాందోళనలతో బతుకుతున్న మహిళాలోకం ఇంకోవైపు... ఇటువంటి రాక్షసపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యువగళం పాదయాత్ర 219వరోజు తుని నియోజకవర్గం తేటగుంట వద్ద 3వేల కి.మీ.ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పం రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం... అన్ని అవరోధాలను అధిగమించి విజయవంతంగా దూసుకుపోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను అంతమొందించేందుకు జనగళమే యువగళమై జెట్ స్పీడ్‌తో సాగుతుంది. 219రోజులుగా లోకేశ్ జైత్రయాత్ర అవిశ్రాంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 10 ఉమ్మడి జిల్లాలు, 92 అసెంబ్లీ నియోజకవర్గాలు, 217మండలాలు/మున్సిపాలిటీలు, 1915 గ్రామాలను స్పృశిస్తూ 219రోజులపాటు సాగిన యువనేత లోకేష్ పాదయాత్ర 3019 కి.మీ.లు పూర్తయింది. ఈ సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేశ్ 70 బహిరంగసభలు, 145 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 1063 వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. అంతేకాదు యువగళం ప్రారంభమయ్యాక వివిధ రూపాల్లో దాదాపు 1.2కోట్ల మంది ప్రజలు యువనేత లోకేశ్‌తో కనెక్ట్ అయ్యారు.

అవాంతరాలను సైతం అధిగమించి

యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ నారా లోకేశ్ ముందుకు సాగుతున్న తీరు టీడీపీ క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువగళం పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఉక్కు సంకల్పంతో యజ్ఞంలా సాగుతున్న యువగళాన్ని అడ్డుకోవడం వైసీపీ నాయకుల వల్ల కాలేదు. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు చెలరేగాయి. లోకేశ్ పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది. యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ.పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.


మాటలతూటాలు పేలుస్తున్న చినబాబు

యువనేత నారా లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్ర నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా మాటలతూటాలు పేలుస్తున్నారు నారా లోకేశ్. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగిన 92అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో తాటిపాక (రాజోలు), ముమ్మిడివరం, కాకినాడ, తుని బహిరంగసభల్లో యువనేత లోకేశ్ మాట్లాడారు.రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమేగాక, ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. సమాధానం చెప్పలేని అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని నారా లోకేశ్ కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది.


సెల్ఫీ ఛాలెంజ్ తో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి!

మరోవైపు యువగళం పాదయాత్ర దారిలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేశ్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.టీడీపీ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి ప‌నులు - వైసీపీ పాల‌న‌లో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీల‌తో లోకేశ్ ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 3.32లక్షలమందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగారు.


3000 కి.మీ పూర్తి

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మెుదలైన ఈ పాదయాత్ర ప్రతీ 100 కిలోమీటర్లు పూర్తి చేసుకునే ప్రాంతంలో నారా లోకేశ్ ఒక్కో హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో తెలియజేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు నారా లోకేశ్. జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగుతున్నయువగళం పాదయాత్ర 212వరోజున ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద 2900 కి.మీ.ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా కల్లుగీత, కొబ్బరి దింపు కార్మికులకు భీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ యువనేత లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ హామీ వల్ల కోనసీమలోని వేలాది కార్మికులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 3వేల కి.మీ.ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా 219వరోజు తుని నియోజకర్గం తేటగుంట యనమల అతిధిగృహం వద్ద యువనేత లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed