సీఎం జగన్‌కు ఆ భయం పట్టుకుంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు

by Disha Web Desk 16 |
rammohan naidu
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు హాయాంలో అముదాలవలస అందాలవలసగా ఉండేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మించారని ఆయన గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న కాలంలో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్, సెజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేశారో శ్రీకాకుళాన్ని కూడా చంద్రబాబు అలా చేస్తారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ సందర్బంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కలవడంతో సీఎం జగన్‌కు నిద్రపట్టంలేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు దొంగ బుద్ధి ఉందని.. ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ.100 కొట్టేస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ, రాజ్యసభలో వైసీపీకి 31 మంది ఎంపీలున్నారని, జగన్ ఢిల్లీ వస్తే వాళ్లంతా భయపడిపోతారని విమర్శించారు. మీ బిడ్డనంటూ సీఎం జగన్ ప్రజల ఆస్తులు కాజేసేందుకు ప్లాన్ వేశారని.. తస్మాత్ జాగ్రత్త అని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.


Next Story

Most Viewed