Breaking: వెలుగులోకి ఎమ్మెల్యే పిన్నెల్లి మరో అరాచకం

by srinivas |
Breaking: వెలుగులోకి ఎమ్మెల్యే పిన్నెల్లి మరో అరాచకం
X

దిశ, వెబ్ డెస్క్: మే 13న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల అల్లర్లు చెలరేగాయి. మాచర్లలో వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణలతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు పాల్వాయి గేటు వద్ద బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడ ఉన్న ఈవీఎం మిషన్లను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిని బెదిరించారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో నియోజకవర్గం నుంచి పారిపోయారు. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకూ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదు.


ఇదిలా ఉండగా పిన్నెల్లికి సంబంధించి మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. శనివారం మాచర్లలో వైసీపీ అనుచరులు రెచ్చిపోయారు. పిన్నెల్లి ప్రోద్బలంతో అనుచరుడు వెంకటేశ్ మాచర్ల 22వ వార్డులో ఓ కుటుంబంపై కత్తితో దాడి చేశారు. వార్డులో కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు. వెంకటేశ్ కత్తి దాడిలో మహిళలతో పాటు బాలుడికి తీవ్ర గాయమైంది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పిన్నెల్లి చేసిన అరాచకంపై కేసు నమోదు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇక వెంకటేశ్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. వెంకటేశ్‌పై ఇప్పటికే 10 కేసులున్నాయి. పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అనుచరుడు వెంకటేశ్ అని స్థానికులు తెలిపారు.

Next Story

Most Viewed