B.R.Ambedkar Memorial: అధికారులకు కీలక సూచనలు

by Disha Web Desk 16 |
B.R.Ambedkar Memorial: అధికారులకు కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డా.బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం పనుల్లో అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని, విగ్రహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. స్మృతివనంలో చేపడుతున్న పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన సూచనల ప్రకారంగానే స్మృతివనాన్ని తీర్చిదిద్దాలని కోరారు.


రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మేరుగు నాగార్జునతో పాటు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తదితరులు అంబేద్కర్ స్మృతివనం పనులను సమగ్రంగా సమీక్షించారు. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి జయలక్ష్మి అంబేద్కర్ స్మృతివనం పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ..125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఢిల్లీలో ఇప్పటికే తయారైన విగ్రహం విడిభాగాలను రాష్ట్రానికి త్వరితగతిన తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం కాళ్ల కింది భాగాన నిర్మించే భవనంలో వ్యాపారాత్మకమైన కార్యక్రమాలు కాకుండా అంబేద్కర్‌కు సంబంధించిన ఫోటోగ్యాలరీ, ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన శిల్పాలు, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయాలను ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన అంబేద్కర్ జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించే పనిలో ఆలస్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం ఆవరణలో సందర్శకులకు అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున సూచించారు.



Next Story