మంత్రి జోగి రమేశ్‌కు ఉద్వాసన...టికెట్ ఇవ్వమన్న వైసీపీ అధిష్టానం

by Seetharam |
మంత్రి జోగి రమేశ్‌కు ఉద్వాసన...టికెట్ ఇవ్వమన్న వైసీపీ అధిష్టానం
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు ఆ ఎమ్మెల్యే. ఇంకా చెప్పాలంటే వైఎస్ జగన్‌కు భక్తుడు అని చెప్పాలి. వైఎస్ జగన్‌పై ఎవరు విమర్శలు చేసినా అసలు తట్టుకోలేరు. మైకుల ముందు వచ్చి ఊదరగొడతాడు. వీరవిధేయుడు కావడంతో వైఎస్‌ జగన్‌ కేబినెట్ విస్తరణలో చోటు కల్పించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రిగా కీలక శాఖను సీఎం జగన్ అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండదండలు తనకే ఉన్నాయని ఇక తన టికెట్‌కు ధీమా లేదని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ సన్నిహితుడి ఆశలపై సీఎం జగన్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలిసే ఉంటుంది కదూ... జోగి రమేశ్. వచ్చే ఎన్నికల్లో మంత్రి జోగి రమేశ్‌కు టికెట్ రాదనే ప్రచారం జోరుగా జరుగుతుంది. పెడన నుంచి జోగి రమేశ్‌ను తప్పిస్తారని ఆయన స్థానంలో మహిళా నాయకురాలికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో జోగి రమేశ్ రాజకీయ భవిష్యత్ ఏంటనే దానిపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

జోగికి టికెట్ ఎసరు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా హాట్ హాట్‌గా సాగుతోంది. టికెట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎలాంటి మెహమాటాల్లేకుండా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే కాదు ఏకంగా మంత్రులను సైతం మార్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులకు స్థానచలనం కలిపించిన సీఎం వైఎస్ జగన్ కొందరిని లోక్‌సభకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరికోవలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేశ్‌ సైతం చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జోగి రమేశ్‌కు టికెట్ కష్టమేనని సీఎం వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

టికెట్ రేసులో ఉప్పాల హారిక

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌కు టికెట్ ఇవ్వని పక్షంలో కృష్ణా జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి ఆమెకు టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పెడనలో క్షేత్ర స్థాయిలో జరిగిన పలు సర్వేలలో మంత్రి జోగి రమేశ్ గ్రాఫ్ బాగాలేదని నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఉప్పాల హారికపై సర్వే నిర్వహించగా ఆమెకు గ్రాఫ్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఉప్పాల హారిక కుటుంబానికి పెడన నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. వైసీపీ సీనియర్ నేత, ఉప్పాల రాంప్రసాద్ కోడలు హారిక. ఉప్పాల హారిక గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానం నుంచి 12,744 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ సీనియర్ నేత అయిన ఉప్పాల రాంప్రసాద్‌‌ కోడలు కావడంతో ఆమెను జెడ్పీ చైర్‌పర్సన్ పదవి లభించింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక నియోజకవర్గంలో జల్లెడ పట్టిందని..ఆమెకు అన్ని వర్గాల ప్రజల్లో మద్దతు ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె టికెట్‌పై వైసీపీ అధిష్టానం కసరత్తు మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది.

జోగి రమేశ్‌కు ప్రత్యామ్నాయం

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ను పెడన నుంచి బరిలోకి దించకపోతే పార్టీ పట్ల చెడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేశ్‌ను వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డుపై విజయవాడ లేదా ఏలూరు ఎంపీ బరిలో నిలుపుతారనే ప్రచారం జరిగింది. లేని పక్షంలో జోగి రమేశ్‌ను మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. మైలవరం నియోజకవర్గం జోగి రమేశ్ సొంత నియోజకవర్గం. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే గెలుపొందే అవకాశాలు దాదాపు ఉన్నట్లు వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పిన నేపథ్యంలో మైలవరం నియోజకవర్గం పరిశీలనలో కూడా జోగి రమేశ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story