నన్ను చూస్తే ఎమ్మెల్యే వెల్లంపల్లికి చలి జ్వరం వస్తోంది: జనసేన నేత పోతిన మహేశ్

by Seetharam |
నన్ను చూస్తే ఎమ్మెల్యే వెల్లంపల్లికి చలి జ్వరం వస్తోంది: జనసేన నేత పోతిన మహేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ నాయకులను, జనసేన జెండాను చూస్తే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు చలి, జ్వరం వస్తుందని జనసేన నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడ పశ్చిమనియోజకవర్గంలో జనసేన అంటేనే వైసీపీ నాయకుల వెన్నులో వణకుపుడుతుందని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని స్వాతి సెంటర్‌లో ఆదివారం వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణను నిరసన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు అనుమతి ఇవ్వని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైఎస్ఆర్‌ విగ్రహాలకు ఎలా అనుమతిస్తుందంటూప్రశ్నించారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఒక వైసీపీ నగర అధ్యక్షుడిలా పనిచేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా అని హెచ్చరించారు. మహనీయుల విగ్రహాలు పెట్టాలని ప్రయత్నిస్తే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడ్డుకుందని మరి వైఎస్ఆర్ విగ్రహాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు నిబంధనలు అడ్డు రావా?.. అని పోతిన మహేశ్ నిలదీశారు. ఈ విగ్రహాల వివాదంపై త్వరలోనే ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు వైఎస్ఆర్‌పై ప్రేమతో కాకుండా చందాలు వసూలు చేసుకోవడానికే ఆయన విగ్రహాలు పెడుతున్నారని పోతిన మహేశ్ ఆరోపించారు. పోతిన మహేశ్ నిరసనకు జనసైనికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పోతిన మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed