‘నీ భార్యను వదిలేసి వెళ్లిపో..లేకుంటే లోపలేస్తా’ భర్తకు కానిస్టేబుల్ బెదిరింపులు: ఒంటిపై పెట్రోల్ పోసుకుని..

by Disha Web Desk 21 |
‘నీ భార్యను వదిలేసి వెళ్లిపో..లేకుంటే లోపలేస్తా’ భర్తకు కానిస్టేబుల్ బెదిరింపులు: ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నాకు న్యాయం చేయండి.. నా భార్య నాతో వచ్చేలా చేయండి అంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అయితే తమ కలతల కాపురాన్ని చక్కదిద్దుతారనుకుంటే ఆ పోలీస్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. నీ భార్యను వదిలేసి వెళ్లిపో. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తా’ అని కానిస్టేబుల్ బెదిరించాడు. కానిస్టేబుల్ మాటలతో బిత్తరపోయిన ఆ బాధితుడు పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటల్లో ఆ వ్యక్తి కాలుతూ పోలీస్ స్టేషన్ వద్దకు దూసుకు రావడంతో స్థానికులు, పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగింది. ఎస్ఐ హిమబిందు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మణికంఠ అనే వ్యక్తి తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దుర్గను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. బతుకు దెరువు కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అయితే దుర్గకు సోనూ అలియాస్ బాషా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి తిరుపతి వెళ్లిపోయింది.

ఎలా పట్టుబడ్డారంటే!

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేటలో దుర్గ, బాషాలు సహజీవనం చేస్తున్నారని తెలుసుకున్నాడు భర్త మణికంఠ. తన భార్య వద్దకు వెళ్లి, పిల్లల కోసమైనా ఆలోచించి తనతో వచ్చేయమని వేడుకున్నాడు. అయినప్పటికీ ఆమె మనసు కరగలేదు. ప్రియుడితో కలిసి భర్తను తిట్టింది. పిల్లలను గెంటేసింది. అయితే వీరికి చంద్రగిరి పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అండదండలు ఉన్నాయని తెలుసుకున్న మణికంఠ సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీనివాసులను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు ‘నీ భార్యను వదిలేసి వెళ్లిపో.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తా’అని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుంచి 2 లీటర్ల పెట్రోలో తెచ్చుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు ఆ మంటలను ఆర్పివేశారు. వెంటనే అతడిని ఆటోలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తన భార్య ఎన్ని తప్పులు చేసినా క్షమించానని...తనకు న్యాయం చేయాలని.. కాలిన గాయాలతో మణికంఠ బాధపడుతున్న తీరు అందరినీ కలచివేసింది. 70 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న మణికంఠ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed