AP:ఐ ల‌వ్ కైలాసగిరి పేరుతో వ్యూ పాయింట్ ప్రారంభం..కూటమి నేతల ఆగ్రహం..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP:ఐ ల‌వ్ కైలాసగిరి పేరుతో వ్యూ పాయింట్ ప్రారంభం..కూటమి నేతల ఆగ్రహం..కారణం ఏంటంటే?
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: కైలాసగిరి పై ‘ ఐ లవ్ కైలాసగిరి’ పేరిట లక్షల రూపాయల ఖర్చుతో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసి వ్యూ పాయింట్‌ను ప్రజా ప్రతినిధులతో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది. ప్రజా ప్రతినిధులంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సమయంలో వారికి సంబంధం లేకుండా, సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ ఎలా చేస్తారని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ నుంచి నాలుగో పర్యాయం వరుసగా విజయం సాధించిన తెలుగుదేశం సీనియర్ నేత వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గం పరిధిలోకి కైలాసగిరి వస్తుంది. ఆయనకు సమాచారం లేదని, ఆహ్వానించలేదని ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాకు సమాచారం లేదు..వెలగపూడి

తనకు ఈ ప్రారంభోత్సవం గురించి తెలియదని, కనీస సమాచారం కూడా లేదని విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు. ఇలా ప్రజా ప్రతినిధులకు తెలియకుండా అధికారులు నిర్ణయాలు తీసుకోవడం, ప్రారంభోత్సవాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళతానని ఆయన చెప్పారు.

గతంలో సొంత నిర్ణయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జి

వుడా చైర్మన్ పోస్టుకు ఇన్చార్జిగా గతంలో వ్యవహరించిన కలెక్టర్ మల్లిఖార్జున అక్కడి నిధులు రెండు కోట్ల రూపాయలతో విశాఖ ఆర్కే బీచ్‌లో పర్యావరణ, అగ్నిమాపక నిబంధనలకు విరుద్ధంగా ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. సరైన ప్రమాణాలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కట్టిన రెండో రోజే కనీసం ఒక్క పర్యాటకుడు కూడా ఎక్కకుండానే మూడు ముక్కలైంది. కష్టపడి వాటిని జాయింట్ చేసిన తర్వాత కూడా విడిపోవడంతో పీకి మూలన పడేశారు. రెండు కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జికి పూర్తిగా కలెక్టర్ బాధ్యుడు కావడంతో ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూటమి నేతల నుంచి వినిపిస్తోంది.

పర్యాటకులను ఆకట్టుకుంటోంది..కలెక్టర్

ప‌ర్యాట‌కుల‌ను మ‌రింత విశేషంగా ఆక‌ట్టుకునేలా ఆధునిక హంగుల‌తో కైలాస‌గిరిపై ఐ ల‌వ్ కైలాస‌గిరి పేరుతో వ్యూ పాయింట్ను నిర్మించారని దాన్ని ప్రారంభించిన కలెక్టర్ అన్నారు. పెద్ద‌పెద్ద అక్ష‌రాల‌తో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారని, రాత్రి వేళ‌ల్లో వెలుగులు వ‌చ్చేలా విద్యుత్ దీపాల‌ను కూడా అమ‌ర్చారని, ఇప్ప‌టికే న‌గ‌రంలో ప‌లు చోట్ల ఉన్న ఐ ల‌వ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూత‌నంగా కైలాస‌గిరిపై ఐ ల‌వ్ కైలాస‌గిరి పేరుతో ప్ర‌త్యేక వ్యూ పాయింట్ను నిర్మించారని క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున అన్నారు. స్థానిక వీఎంఆర్డీఏ అధికారుల‌తో క‌లిసి వ్యూ పాయింట్ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ కాసేపు గ‌డిపారు. అధికారులంద‌రితో క‌లిసి బృంద చిత్రం దిగారు. పర్యాట‌కుల‌ను ఈ వ్యూ పాయింట్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని, సెల్ఫీ పాయింట్ గా నిలుస్తుంద‌ని, ప్ర‌త్యేక‌త‌ను చాటుకోనుంద‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్బంగా అభిప్రాయ‌పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed