Srisalam: మల్లన్నను దర్శించుకోనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

by Disha Web Desk 16 |
Srisalam: మల్లన్నను దర్శించుకోనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
X

దిశ, కర్నూలు ప్రతినిధి : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ వై.చంద్రచూడ్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన శనివారం, ఆదివారం కర్నూలులో రెండు రోజుల పాటు ఉండనున్నారు. దీంతో ఆయన పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీశైల పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతిలతో కలిసి సమీక్షించారు. సున్నిపెంట హెలిప్యాడ్ మైదానాన్ని సిద్ధం చేసి చుట్టూ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలని ఆర్ అండ్ బీ, అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.

కాన్వాయ్ వెంట 12 మంచి కండిషన్ గల వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారులకు సూచించారు. భ్రమరాంబ అతిథి గృహంలో ప్రొటోకాల్ ప్రకారం అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. హెలిప్యాడ్ సమీపంలో మెడికల్ క్యాంప్, అంబులెన్స్‌తో పాటు డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్ఎస్, నంద్యాల సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డ్యూటీ పాసులు మంజూరు చేయాలని ఆత్మకూరు ఆర్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయ మూర్తులు, వివిధ జిల్లాల న్యాయమూర్తులు శ్రీశైలం వస్తున్న సందర్భంగా హెలిపాడ్ మొదలుకొని భ్రమరాంబ అతిథి గృహం, శ్రీశైలం దేవస్థానం తదితర ప్రదేశాల్లో ముమ్మర పారిశుధ్య పనులు చేపట్టాలని డీపీవో, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓను ఆదేశించారు. హెలిప్యాడ్ సమీపంలో వీఐపీలకు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈకి సూచించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు, డ్యూటీ అధికారులకు ఆహార పదార్థాల పాకెట్లను అందజేయాలని తెలిపారు.

Next Story