Ys Jagan: నా మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే

by Disha Web Desk 16 |
Ys Jagan: నా మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే
X
  • నా ఆచరణ మీరే..నా వెనుక ఉన్న ఆ నలుగురు మీరే
  • నా హృదయంలో మీరు.. మీ హృదయంలో నేను
  • బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు..బ్యాక్‌బోన్‌ క్లాసులు
  • బీసీలంటే మన నాగరికతకు పట్టుగొమ్మలు
  • ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చా
  • మూడున్నరేళ్లలో బీసీలకు రూ.1.63లక్షల కోట్లు ఖర్చు చేశా
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు
  • జయహా బీసీ మహాసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

దిశ, డైనమిక్ బ్యూరో: తన మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలవారేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జయహో బీసీ మహాసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం వైఎస్ జగన్ సభను ఉద్దేశించి మాట్లాడారు. 'నా ఆచరణ కూడా బీసీలే. నా వెనక ఉన్న ఆ నలుగురు కూడా మీరే. మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు. ఇది ఎప్పటికీ మన అనుబంధం. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాసులని, బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలు' అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

వేల సంవత్సరాలుగా గ్రామం, నాగరికతకు పట్టుగొమ్మలు బీసీలేనని సీఎం జగన్ తెలిపారు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ, ఇంటి గడప తయారీ బీసీ, ఇంటి ఇటుకల తయారీ బీసీ, ఇంటి పునాది నుంచి పైకప్పు వరకు ప్రతీ అణువు బీసీ అని వైఎస్ జగన్ చెప్పారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ప్రస్తావించిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు. 'కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రపం, కొడవలి, నాగలి, ఇలా సహస్త్ర గ్రామీణ వృత్తుల సంగమం.. వేల సంవత్సరాలుగా కుటీర పరిశ్రమల సముదాం మన బీసీ. బీసీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు ఎంత చరిత్ర ఉందో.. వాటిని వేల సంవత్సరాలుగా వారి భుజస్కంధాల మీద మోస్తున్న ఘనమైన చరిత్ర బీసీలది' అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

వెన్నెముక కులాలుగా మార్చా

ప్రజా సంకల్ప యాత్రలో 139 బీసీ కులాల్లో ప్రతీ ఒక్క కులాన్ని కలిసి వారి కష్టాలు, నష్టాలు అన్ని చూశానని. దాని ఫలితమే 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ కులాలు వెనుకబడిన కులాలు కాదని, వెన్నెముక కులాలుగా మార్చే ప్రతీ ప్రయత్నం చేస్తానని నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నింటిలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని జగన్ తెలిపారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదిక మీద నియమించేందుకు చట్టం చేశామని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. ఇవాళ 85 వేల మంది ప్రజా ప్రతినిధులు బీసీ మహాసభకు తరలివచ్చి చిరునవ్వుతో కూర్చోవడమే ప్రభుత్వం చేసిన మంచికి సాక్ష్యమని సీఎం జగన్ అన్నారు.' షాపులు పెట్టుకొని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న నా బీసీలకు జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాలు తీసుకొచ్చాం. జగనన్న చేదోడు ద్వారా నా రజకులు, నా నాయీ బ్రాహ్మణులు, నా టైలర్‌ సోదరులకు ఇప్పటి వరకు రూ.584 కోట్లు చెల్లించాం. జగనన్న తోడు ద్వారా తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌ మీద దుకాణాలు నడుపుకుంటున్న ఆ వర్గాలకు సున్నావడ్డీ ద్వారా అందించిన ఆర్థిక సాయం ఇప్పటి వరకు రూ.2059 కోట్లు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకాన్ని అమలు చేశాం. తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కు ఇచ్చాం. ఏ డిగ్రీ అయినా ఇంజినీరింగ్‌ నుంచి డాక్టర్‌ వరకు ఎంత ఫీజు అయినా వందశాతం ఆ ఫీజును భరించే విధానాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేశాం.' అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

'జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి రూ.3349 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభలో తెలిపారు. 'మత్స్యకారులకు వైఎస్ఆర్‌ మత్స్యకార భరోసా ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చెల్లించాం. సొంతమగ్గం ఉన్న చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ప్రతీ ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం అందించాం. ఈ మూడున్నరేళ్లలో బీసీలకు మాత్రమే డీబీటీ, నాన్‌ డీబీటీ కింద ఖర్చు చేసిన మొత్తం ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేశాం. వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇదీ.' అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ఒంటరి పోరాటం చేస్తానని చంద్రబాబు చెప్పగలడా?

జయహో బీసీ మహాసభ వేదిక ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాడు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో హామీలు అమలు చేయండని ఆ రోజుల్లో మత్స్యకారులు అడిగితే ఖబడ్దార్, అంతు చూస్తానని చంద్రబాబు హెచ్చరించారని సీఎం జగన్ గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులు హామీల గురించి అడిగితే తోకలు కత్తిరిస్తానని అవహేళన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం వైఎస్ జగన్ సభలో ప్రస్తావించారు. 'మాకు తోకలు లేవుగానీ, మీ తోకలను, మీకు మొలిచిన కొమ్ములను, మీకు కొమ్ముకాసేవారిని అందరినీ కత్తిరించే సామాజిక చైతన్యం మాకుందని గట్టిగా చంద్రబాబుకు చెప్పాలి.' అని సీఎం జగన్ సూచించారు. 'చంద్రబాబు తన 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతకు ముందు పేద వర్గాలకు మంచి చేసిన దాఖలాలు లేవు. మంచి చేసి ఉంటే 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే వాడు కానీ అలా చేయడం లేదు. ఎందుకంటే చంద్రబాబు చేసిన మంచి ఏమీ లేదు. బీసీలకు చంద్రబాబు చేసిన మంచి ఏంటో చెప్పుకోలేడు. ఈ రోజు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, మోసాలు చేసే కార్యక్రమాలకు తెగబడుతున్నారు.' అని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.


Next Story

Most Viewed