తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు షాక్

jalasouda

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సంయుక్తంగా నిర్వహించిన పుల్ బోర్డు మీటింగుకు తెలంగాణ గైర్హాజరైంది. సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులెవ్వరూ హాజరుకాలేదు. హాజరుకాబోమంటూ ఇప్పటికే మూడుసార్లు లేఖల ద్వారా తెలంగాణ స్పష్టం చేసింది. ఆ ప్రకారమే మీటింగుకు దూరంగా ఉండిపోయింది. కోర్టు కేసులను కారణంగా చూపి మీటింగు తేదీని వాయిదా వేయాలని కోరినా బోర్డు మాత్రం షెడ్యూలు ప్రకారమే నిర్వహించింది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. గెజిట్‌లో ఉన్న అభ్యంతరాలను బోర్డుల దృష్టికి తీసుకెళ్ళారు. కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతామని వివరించారు.

ఈ నెల 3వ తేదీన రెండు రాష్ట్రాలతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి సైతం తెలంగాణ ఆబ్సెంట్ అయింది. ఫుల్ బోర్డు మీటింగ్ లేకుండా సమన్వయ కమిటీలో పెద్దగా చర్చించలేమని, అందువల్ల పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రెండు బోర్డులకూ తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ సూచన ప్రకారమే రెండు బోర్డులూ మాట్లాడుకుని ఆగస్టు 9వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారాన్ని రెండు రాష్ట్రాలకూ ఇచ్చాయి. కానీ మూడు రోజుల ముందు నుంచే తెలంగాణ లేఖల ద్వారా ఈ సమావేశానికి హాజరుకాలేమంటూ నిర్దిష్టమైన కారణాలను చూపింది. కానీ తెలంగాణ తన వాదాన్ని నెగ్గించుకోలేపోయింది. బోర్డులు కూడా మెట్టు దిగకుండా షెడ్యూలు ప్రకారమే సమావేశాన్ని ముగించాయి.

తెలంగాణ హాజరుకాకపోవడాన్ని బోర్డులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముందుగానే తీసుకెళ్ళాయి. తెలంగాణ హాజరైనా కాకపోయినా సమావేశాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహించాల్సిందేనని జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టమైన ఆదేశం ఇచ్చిందని ఓ అధికారి వివరించారు. గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, పెట్టుకున్న గడువు ప్రకారం పనులు జరగాల్సిందేనని, వాయిదాలతో జాప్యం జరుగుతుందని, అందువల్ల షెడ్యూలుకు విఘాతం కలగకుండా పనులు జరగాలని నొక్కిచెప్పిందని ఆ అధికారి పేర్కొన్నారు.

సమావేశం అనంతరం జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి హాజరైన అధికారి మాట్లాడుతూ, గెజిట్‌లోని కొన్ని అంశాల పట్ల ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పిందని, సవరణలకు పట్టుబట్టనున్నట్లు ఈ సమావేశంలో సంకేతాలిచ్చిందని పేర్కొన్నారు. అభ్యంతరాలతో తమకు సంబంధం లేదని, కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడాన్ని అడ్డుకోబోమని, అయితే ప్రాజెక్టుల వివరాలు, సమాచారం తదితరాలను మాత్రం బోర్డులకు సమర్పించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రతినిధులకు అర్థం చేయించినట్లు తెలిపారు.

గెజిట్‌లో పేర్కొన్న ప్రకారం నెల రోజుల వ్యవధిలో ముందుగానే ఖరారు చేసుకున్న కార్యాచరణ పూర్తికావాల్సి ఉన్నదని, అందువల్లనే సమావేశాన్ని వాయిదా వేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేకపోయినట్లు ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ సుజాతరావు తెలిపారు.

గెజిట్ అమలుకు సహకరిస్తామని, గెజిట్‌లోని షెడ్యూలు 1, 2, 3 లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామలారావు తెలిపారు.