కీలక భేటీ: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం

by Disha Web Desk 21 |
కీలక భేటీ: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను పవన్‌ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కల్యాణ్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పొత్తుల ప్రక్రియ మరింత వేగం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టోనే ప్రధాన అంశంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఆ కమిటీలు ప్రతిపాదించిన అంశాలు... వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువరు అధినేతలు వాడీవేడిగా చర్చించినట్లు తెలుస్తోంది.

పార్టీ నేతల మధ్య లొల్లిపై చర్చ

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో ఇరు పార్టీలు మరింత దూకుడుగా కలిసి వెళ్తాయని అంతా భావించారు. అయితే నియోజకవర్గాల వ్యాప్తంగా జరిగిన ఆత్మీయ సమావేశాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇరుపార్టీల నేతలు బహిరంగ విమర్శలకు దిగితే మరికొన్ని చోట్ల బాహాబాహికి దిగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పొత్తులపై అనేక సందేహాలు వెలువడ్డాయి. పొత్తుపై పలువురు సందేహాలు సైతం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ రాద్ధాంతం అన్నింటికి సీట్ల పంపకాలే కారణమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారు అనేది క్లారిటీ లేకపోవడంతో ఇరు పార్టీల నేతలు ఆశావాహులు కావడంతో ఈ బాహబాహికి దిగినట్లు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ గొడవలు ఇరు పార్టీలకు పెద్ద మైనస్‌గా మారింది. అధినేతలు మారినంత మాత్రాన పార్టీ కార్యకర్తలు సైతం మారాలా? అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కీలక అంశాలపై చర్చ

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యింది. ప్రజల్లోకి దూసుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం ఈనెల 7 తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ షెడ్యూల్ మాత్రం ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశంపై ఇరువురు అధినేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధమైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి నుంచే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి స్పందన వస్తోందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు సీట్ల పంపకాలు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా స్వల్ప చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ల భేటీలో లోకేశ్‌ పాల్గొన్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.Next Story

Most Viewed