ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ నజర్

by Disha Web Desk 16 |
ఆంధ్రప్రదేశ్  పై కేసీఆర్ నజర్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు.అలా అనడం కంటే దృష్టి పెట్టాల్సి వచ్చింది అనడం కరెక్ట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన లాంఛనమే. పార్టీ పేరు- అజెండా ల పైన క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ ప్రాంత పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీగా మారుతోంది. అయితే జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకోవాలంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్లు - సీట్లు సాధించాలి. కనీసం మూడు రాష్ట్రాల్లో రెండు శాతం లోక్ సభ సీట్లు సాధించాలి.

లేదా నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి. అందులో భాగంగా..ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ప్రకటన తరువాత దేశ వ్యాప్త పర్యటనకు సిద్దం అవుతున్నారు.విజయదశమి రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామనే ధీమా లో సీఎం కేసీఆర్ ఉన్నారు. తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పైన కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ తో పాటు పలు రాష్ట్రాల పై దృష్టి

జాతీయ పార్టీ ఏర్పాటయ్యాక ప్రధానంగా తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టి సారించనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా సీట్లున్నాయని.. వీటిలో 50-60 స్థానాలు గెలుస్తామని కేసీఆర్‌ ధీమాతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని రైతు ఓటింగ్ పైన కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్రలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు వంటి నగరాల్లోనూ పార్టీకి ఆదరణ ఉంటుందని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీలో కేసీఆర్ కి ఓట్లు పడతాయా?

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి మరెక్కడా లేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమం గురించే ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా ఇలాగే చేస్తామంటే జనం నుంచి ఆదరణ లభిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

అయితే, కేసీఆర్ తన పార్టీ విస్తరణలో భాగంగా ఏపీలోని అంశాలు- రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏపీలో తనకు ఓట్లు ఖాయమనే అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

సరిహద్దు జిల్లాల పైనే ఆశలు

కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ తన రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ప్రాంతీయ పార్టీల అధినేతలతో రాజకీయాలపై చర్చించిన కేసీఆర్ - ఏపీ సీఎం తో చర్చలు చేయలేదు. ఏపీ సీఎం ఇప్పటికే బీజేపీతో సఖ్యతతో ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఏపీలో ఓట్లు సాధించాలంటే హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ మూలాలు ఉన్న వారితో పాటుగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిసిన ఖమ్మం జిల్లా గ్రామాల నుంచి మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆ గ్రామాల ప్రజలు సైతం తమను తెలంగాణలో కలపాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.

జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది?

ఏపీలో కేసీఆర్ పార్టీ విస్తరించాలంటే సీఎం జగన్ వైఖరి పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల వైసీపీ ఏ పార్టీతోనూ - ఏ ఫ్రంట్ లోనూ భాగస్వాములం కాబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడిన ఏపీ ప్రాంతానికి చెందిన వారిని ఆకట్టుకుంటూ..ఏపీలోనూ ఓట్లు సాధించటమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఏపీలోనూ కేసీఆర్ కు మద్దతిచ్చే వారు ఉన్నారనే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, 2024 ఎన్నికల్లో సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే. ఈ సమయంలో ఏపీలో ఆ రెండు పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీకి - బీజేపీకి వ్యతిరేకంగా సహకారం అందిస్తాయా అనేది సందేహమే.

ఈ రెండు పార్టీలను ఎదుర్కొంటూ కేసీఆర్..ఏపీలో తన లక్ష్యం చేరుకోగలరా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్ ఏపీలో తమ ప్రణాళికల పైన స్పష్టత ఇవ్వనున్నారని TRS వర్గాలు చెబుతున్నాయి.

Next Story