వైసీపీలో జమిలీ ఎన్నికల హంగామా: జగన్ లండన్‌ నుంచి వచ్చాక కీలక భేటీ

by Disha Web Desk 21 |
ysrcp 11years
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మరో ఏడు నెలలు సమయం ఉంది. ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని అటు టీడీపీ ఇటు వైసీపీ మరోవైపు జనసేనలు ప్రకటించాయి. అంతేకాదు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పదేపదే చెప్పుకొస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తే చాలు అన్ని అంశాల కంటే ముందు బయటకు వచ్చే అంశం ముందస్తు ఎన్నికలు. అయితే వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు తాము వెళ్లడం లేదని చెప్పుకొస్తుంది. ఇలాంటి తరుణంలో జమిలీ ఎన్నికల తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే జమిలీ ఎన్నికలకు వైసీపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపాల్సి వస్తే వైసీపీ ప్రభుత్వం కూడా దానికి అంగీకారం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ జమిలీ ఎన్నికలపై ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

సజ్జల రియాక్షన్ ఏంటంటే!

ఇప్పటికే జమిలీ ఎన్నికలపై వైసీపీ సైతం విభిన్నంగా స్పందించింది. ఒకవైపు స్వాగతిస్తూనే మరోవైపు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని వాటిపై స్పష్టత రావాల్సి ఉందని అంటుంది. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో జమిలీ ఎన్నికలపై కసరత్తు జరగాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందరితో చర్చించిన తర్వాత జమిలీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతేకాదు జమిలి ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదంటూనే.. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం మంచి పరిణామం అన్నారు. దీంతో జమిలీ ఎన్నికలకు ప్రభుత్వం అనుకూలంగా ఉందనేలా సజ్జల రామృష్ణారెడ్డి వ్యాఖ్యలున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేంద్రం నిర్ణయంపైనే వైసీపీ భారం

ఏపీలో 2024 ఏప్రిల్ నెలలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం గనుక జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే.. దానికి వైసీపీ కూడా అంగీకారం చెబుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే అందుకు తగినట్లుగా పార్టీ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత కీలక సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభతో పాటే ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలపై వైసీపీ సమీక్ష నిర్వహించనుంది.

జమిలీ ఎన్నికలకు వెళ్తారా?

జమిలీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే లోక్ సభతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే నిర్ణీత గడువు కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్తే గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయనే దానిపై ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో పాటు కేడర్ మొత్తం సుమారు ఏడాదిన్నరగా ప్రజల్లోనే ఉంటూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇతర నేతలు స్వయంగా ప్రజలను ఇంటింటికి వెళ్లి కలవడం, వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇవే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్తున్నారు. దాదాపు 70 శాతం మంది ప్రజలు తమవైపే ఉన్నారని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన సర్వేలు, ఇతర నివేదికలు వైసీపీకి సానుకూలంగా ఉండటంతో తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతామనే అభిప్రాయంతో వైసీపీ అధిష్టానం ఉంది. ఈ పరిణామాలతో జమిలీ ఎన్నికలు వచ్చినా...ఏపీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని వైసీపీ చెప్తోంది.మొత్తానికి జమిలీ ఎన్నికల ప్రచారంతో ఏపీలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.

Next Story

Most Viewed